
‘సప్లిమెంటరీ’కి పక్కాగా ఏర్పాట్లు
అనంతగిరి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్‌లోని కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని వివరించారు. జిల్లాలో 20 పరీక్ష కేంద్రాల్లో మొదటి సంవత్సరం జనరల్‌లో 5,217మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 457 ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 2,071మంది, ఒకేషనల్‌లో 314 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సదుపాయం కల్పి ంచాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా వైద్యాధికారి వెంకటరవణ, ఆర్టీసీ డిపో మేనేజర్ అరుణ, వివిధ శాఖల అధికారులు, జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్, జిల్లా పరీక్షల సమన్వయ కమిటీ సభ్యు లు నర్సింహారెడ్డి, సత్తయ్య, ప్రిన్సిపాల్ సురేశ్వరస్వామి, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్
సజావుగా ధాన్యం సేకరణ
జిల్లాలో ఇప్పటి వరకు 25వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం నగరం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహన్‌తో కలిసి ధాన్యం కొనుగోలు, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 128 కొనుగోలు కేంద్రాల ద్వారా 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రికి వివరించారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, టార్పాలిన్లు, సంచులు, తేమ శాతం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సరైన సమయంలో రైతులు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఆర్‌డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.