
చట్టపరంగా దత్తత తీసుకోవాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● ఇటలీ దంపతులకు బాలుడి అప్పగింత
రసాయనాలతో పంటలకు నష్టం
● ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త లక్ష్మణ్
అనంతగిరి: పిల్లలు లేని దంపతులు చట్టపరంగా దత్తత తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్ కంట్రీ(ఇటలీ) దంపతులకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వికారాబాద్ శిశు గృహలో పెరుగుతున్న ఎనిమిది సంవత్సరాల అబ్బాయిని దత్తత ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరంగా కాకుండా పిల్లలను తీసుకుంటే నేరమని, పిల్లలను దత్తత తీసుకోవాలంటే జిల్లా సంక్షేమ శాఖ పరిధిలోని శిశు గృహ వికారాబాద్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జయసుధ, సీడబ్ల్యూసీ చైర్ పర్మన్ వెంకటేశం, బీఆర్‌బీ కోఆర్డినేటర్ కాంతారావు, డీసీపీఓ శ్రీకాంత్, శిశు గృహ మేనేజర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్: పంటల సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త లక్ష్మణ్, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త టి.రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని పర్సాపూర్ గ్రామ రైతు వేదికలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెతులు అధిక మొత్తంలో యూరియా వాడుతున్నారని అన్నారు. యూరి యా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. యూరియా అధికంగా వాడటం వల్ల నేల సారవంతం దెబ్బతిని ఉత్పాదకత తగ్గుతుందన్నారు. సాగు ఖర్చులు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. రసాయనాల వాడకం వల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు చనిపోతున్నాయని తెలిపారు. అనంతరం కొడంగల్ పీఏసీఎస్ చైర్మన్ కటుకం శివకుమార్ గుప్తా, కొడంగల్ ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్ మాట్లాడారు. రైతులు సేంద్రియ ఎరువులను వాడి ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తప్పక పాటించాలన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. సాగునీటిని ఆదా చేసి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. పంటలకు ఎంత నీటి అవసరం ఉంటే అంతే నీటిని వినియోగించుకోవాలన్నారు. ఆ తర్వాత వ్యవసాయయ ఉప సంచాలకులు శంకర్ రాథోడ్ మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేప్పుడు రైతులు తప్పని సరిగా రసీదులు పొందాలన్నారు. రసీదులు ఉంటే కష్టకాలంలో నష్ట పరిహారం పొందే అవకాశం ఉంటుందన్నారు. మండల వ్యవసాయాధికారి తులసీ మాట్లాడుతూ.. పంట మార్పిడి విధానం పాటించాలని సూచించారు. పంట మార్పిడితో భూసారం పెరుగుతుందన్నారు. పురుగులు, తెగుళ్ల నుంచి పంటలకు స్వీయ రక్షణ లభిస్తుందన్నారు.

చట్టపరంగా దత్తత తీసుకోవాలి