9నుంచి ప్రత్యేక లోక్ అదాలత్
● చెక్ బౌన్స్ కేసులను రాజీ చేసుకోండి ● కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీరాం
కొడంగల్: కొడంగల్ కోర్టు పరిధిలో గతంలో నమోదైన చెక్ బౌన్స్ కేసులను రాజీ చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి బి.శ్రీరాం సూచించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జూన్ 9నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రూ.5 లక్షల లోపు చెక్కులు బౌన్స్ అయిన వాటికి గతంలో కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ఈ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్‌లో రాజీ కుదుర్చుకోవాలన్నారు. చెక్ బౌన్స్ విషయంలో కాంప్రమైజ్ ఫీజు తీసుకోవడం లేదన్నారు. ఇరువర్గాల అంగీకారం మేరకు కేసులను పరిష్కరించనున్నట్లు చెప్పారు. బ్యాంకులకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసుల్లో కూడా రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని వివిధ కోర్డుల్లో మొత్తం 89,900 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. గతంలో హైదరాబాద్ డివిజన్ పరిధిలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 3,107 చెక్ బౌన్స్ కేసులకు పరిష్కారం లభించినట్లు చెప్పారు. రాజీమార్గం ద్వారానే ఇరు వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. జూన్ 14వ తేదీ వరకు జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో మరిన్ని కేసులను పరిష్కరించనున్నట్లు చెప్పారు. సివిల్, క్రిమినల్ కేసులకు రాజీ మార్గంలో పరిష్కారం లభిస్తుందన్నారు. భూములు, గట్టు పంచాయితీలు, ఆర్థిక విషయాల్లో సివిల్, క్రిమినల్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు చెప్పారు. ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.


