పార్కు స్థలాన్ని చదును చేసిన వ్యక్తిపై కేసు
రాజేంద్రనగర్: పార్కు స్థలాన్ని చదును చేసిన వ్యక్తిపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో సమాచారం మేరకు... స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పురా భవానీకాలనీలో గతంలో లకన్ సింగ్ అనే వ్యక్తి వెంచర్ చేసి 1000 గజాల పార్కు స్థలాన్ని వదిలారు. కాలనీ ప్రజలు ఈ పార్కు స్థలాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్థలం విలువలు పెరిగిపోవడంతో సోమవారం ఉదయం జేసీబీతో లకన్ సింగ్ పార్కు స్థలం వద్దకు వచ్చాడు. జేసీబీతో చదును చేస్తుండగా కాలనీవాసులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లకన్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని జేసీబీని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
రాజేంద్రనగర్: గుర్తు తెలియని మృతదేహం లభించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మామిడి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ ఓఆర్‌ఆర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడి వయస్సు 25–30 సంవత్సరాలు ఉంటుందని... మృతుడి ఒంటిపై బ్లూ కలర్ ప్యాంట్, బ్లూ కలర్ షర్ట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే రాజేంద్రనగర్ పోలీసులకు కానీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ సిబ్బందిని సంప్రదించాలన్నారు.
క్రషర్ మెషిన్‌లో పడి కార్మికుడి మృతి
మేడ్చల్‌రూరల్: క్రషర్ మెషీన్‌లో పడి కార్మికుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మద్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనీష్‌సింగ్(27) గిర్మాపూర్‌లోని రోబో సిలికాన్ క్రషర్ మెషీన్‌లో ప్లాంట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారు జామున విధుల్లో ఉన్న అతను ప్రమాదవశాత్తు క్రషర్ మెషీన్‌లో పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


