ఘనంగా మైసమ్మ బోనాలు
దుద్యాల్: మండల పరిధిలోని కుదురుమల్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని కాలనీలో ఉదయం నుంచి మహిళలు సందడి చేశారు. రాత్రి వేళ అమ్మవారికి సమర్పించే బోనాల ఊరేగింపు ఆకట్టుకుంది.
గుర్తు తెలియని
వృద్ధుడి మృతి
అనంతగిరి: గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన వికారాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భీంకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద ఈనెల 7న సాయంత్రం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడు 60–65 ఏళ్ల వయసు కలిగి ఉన్నాడని, బ్రౌన్ కలర్ షర్ట్, తెల్లగడ్డం ఉందన్నారు. ఎవరైనా గుర్తుపడితే వెంటనే తమకు తెలియజేయాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు బుధవారం సీఐ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
బొంరాస్‌పేట: మండల పరిధిలోని దుప్‌చర్లలో ఇసుకను నిల్వచేసి అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టరును మంగళవారం రాత్రి పోలీసులు పట్టేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవూఫ్ తెలిపారు. తహసీల్దారు అనుమతులు ఉన్న చోట కాకుండా అక్రమంగా మరో చోటునుంచి ఇసుకను నిల్వచేసి తరలిస్తున్న దుప్‌చర్లకు చెందిన శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, ట్రాక్టరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన వివరించారు.
సన్నబియ్యం పేదలకు వరం
దౌల్తాబాద్: పేదలకు సన్నబియ్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం పేదలకు వరంలాంటిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. బుధవారం మండలంలోని గోకఫసల్వాద్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వీరన్న, కొండాగోపాల్, భీంరెడ్డి, రెడ్డిశ్రీనివాస్, షకీల్, జాకీర్ తదితరులున్నారు.
రేపటి నుంచి
బాకారం ఉత్సవాలు
యాలాల: మండలంలోని బాకారం ఆంజనేయస్వామి జాతర ఉత్సవాలు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి రోజు భజన మండలి ఆధ్వర్యంలో యాలాల నుంచి స్వామివారి పల్లకీ సేవా కార్యక్రమం ఆలయం వరకు ఉంటుందన్నారు. శనివారం రోజు స్వామి వారికి అభిషేకం, అన్నదానం, రథోత్సవం ఉంటుందని తెలిపారు. ఆదివారం సత్యనారాయణస్వామి పూజ, పెరుగుబసంతం తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆంజనేయస్వామి వంశపారంపర్య అర్చకులు, ధర్మకర్తలు హర్షవర్ధన్‌జోషి, విష్ణువర్ధన్‌జోషి తెలిపారు.
12న కరన్‌కోట్‌లో రథోత్సవం
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12, 13వ తేదీల్లో జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమాన్ ఆలయం వద్ద 12న రాత్రి 10 గంటలకు రథోత్సవం, 13న లంకాదహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


