
సిలిండర్ గ్యాస్‌లీకై ..నిప్పురవ్వలు ఎగసిపడి
మణికొండ: ఐటీ సంస్థలకు నిలయమైన ఓ బహుళ అంతస్తుల టవర్‌లో క్యాంటీన్ ఏర్పాటు పనులు చేస్తున్న క్రమంలో వెల్డింగ్ సిలిండర్ లీకై ..నిప్పు రవ్వలు ఎగసిపడి ఆరుగురికి గాయాలయ్యాయి. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోకాపేటలోని ఘర్ (జీఏఆర్) భవనంలో అనేక ఐటీ సంస్థలు కొనసాగుతున్నాయి. వారికి అనుకూలంగా ఉండేలా గ్రౌండ్ ఫ్లోర్‌లో కొత్తగా క్యాంటీన్ ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. శనివారం సాయంత్రం వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ నుంచి గ్యాస్ అధికంగా విడుదలై నిప్పు రవ్వలు చెలరేగాయి. దీంతో అక్కడే ఉన్న క్యాంటీన్ యజమాని రాకేష్‌తో పాటు కార్మికులు రిజ్వాన్, అన్వర్ మాలిక్, శివ, ఫరూఖ్ మాలిక్, రాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అందులో ఒకరికి 50 శాతం, మరొకరికి 40 శాతం, నలుగురికి 30 శాతం కాలిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న నార్సింగి ఏసీపీ రమణగౌడ్, వట్టినాగులపల్లి అగ్నిమాపక శాఖ అధికారులు, హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నారు. అయితే అది అగ్ని ప్రమాదం కాదని, వెల్డింగ్ మిషన్ వద్ద గ్యాస్, అగ్గిరవ్వలు అధికంగా రావటంతో ప్రమాదం జరిగిందని ఏసీపీ తెలిపారు.
ఆరుగురికి గాయాలు