అంగట్లో పర్మిట్లు! | - | Sakshi
Sakshi News home page

అంగట్లో పర్మిట్లు!

Mar 11 2025 7:21 AM | Updated on Mar 11 2025 7:20 AM

సీఎం సొంత జిల్లాలో జోరుగా ఇసుక దందా
● పూర్తయిన రోడ్డుకు ఇసుక పర్మిషన్‌ ఇచ్చిన రెవెన్యూ అధికారులు ● 5 ట్రాక్టర్లతో 30 ట్రిప్పులకు అనుమతి ● మంబాపూర్‌ సమీపంలో డంపింగ్‌ చేసిన అక్రమార్కులు ● తప్పుడు ప్రొసీడింగ్‌లతో అనుమతులు పొందారు: తహసీల్దార్‌ ● పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి ● బషీర్‌మియా తండాలోనూ ఇదే పరిస్థితి

తాండూరు రూరల్‌: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కొంత మంది అక్రమార్కులు తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది రెవెన్యూ అధికారులను బురిడీ కొట్టించారు. ఆరు ట్రాక్టర్లతో 40 ట్రిప్పుల ఇసుక రవాణాకు పర్మిషన్‌ తీసుకొని పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌ సమీపంలో డంపింగ్‌ చేశారు. తప్పుడు ప్రొసీడింగ్‌ కాపీలు చూపి పర్మిషన్‌ పొందారని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తాండూరు తహసీల్దార్‌ చెప్పడం గమనార్హం. ఇసుక, మైనింగ్‌ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నా తాండూరులో మాత్రం ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది.

పూర్తయిన సీసీ రోడ్డు పేరిట..

పెద్దేముల్‌ మండలం ఖానాపూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ కింద రూ.4 లక్షలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులకు పంచాయతీ రాజ్‌ అధికారులు అనుమతులు కూడా ఇచ్చారు. 15 రోజుల క్రితం రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. నాలుగు రోజుల క్రితం మంబాపూర్‌ గ్రామానికి చెందిన ద్యావరి గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి (తప్పుడు ప్రొసీడింగ్‌ కాపీలతో) ఖానాపూర్‌లో సీసీ రోడ్డు పనులకు ఇసుక కావాలని తాండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్‌ తారాసింగ్‌.. గోపాల్‌రెడ్డి తోపాటు గ్రామానికి చెందిన శివ, రమేష్‌, మహేష్‌, వెంకట్‌రాజు ట్రాక్టర్లకు పర్మిషన్‌ ఇచ్చారు. వీటి ద్వారా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాల్లో) 30 ట్రిప్పుల ఇసుకకు అనుమతులు ఇచ్చారు. ఐదు ట్రాక్టర్ల ద్వారా మంబాపూర్‌లో ఇసుకను డంపింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది.

పాఠశాల కోసం..

ఇదిలా ఉండగా యాలాల మండలం బషీర్‌మియా తండాలోని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం ఇసుక అవసరం అని ఖాంజాపూర్‌కు చెందిన వెంకటయ్య దరఖాస్తు చేసుకున్నాడు. సోమ, మంగళవారాల్లో 10 ట్రాక్టర్ల ఇసుకకు తహసీల్దార్‌ పర్మిషన్‌ ఇచ్చారు. అయితే ఆ పాఠశాలలో ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. అక్రమంగా అనుమతులు పొంది తండాలోని ప్రైవేట్‌ వ్యక్తులకు ఇసుక విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయమై తహసీల్దార్‌కు ఫిర్యాదులు అందాయి.

పోలీసులకు ఫిర్యాదు చేస్తా

పెద్దేముల్‌ మండలం ఖానాపూర్‌లో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయని ఇసుక అవసరం అని మంబాపూర్‌కు చెందిన గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి తప్పుడు ప్రొసీడింగ్‌లతో దరఖాస్తు చేసుకున్నాడు. రోడ్డు పనులు పూర్తయిన విషయం తెలియక ఇసుక రవాణాకు పర్మిషన్‌ ఇచ్చా. స్థానికుల ద్వారా అసలు విషయం తెలిసింది. మంబాపూర్‌లో ఇసుక డంపింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా.

– తారాసింగ్‌, తహసీల్దార్‌, తాండూరు మండలం

అంగట్లో పర్మిట్లు!1
1/2

అంగట్లో పర్మిట్లు!

అంగట్లో పర్మిట్లు!2
2/2

అంగట్లో పర్మిట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement