కల సాకారమయ్యేనా!
కొర్రీలు పెట్టి కొండెక్కించి
వికారాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా పరిస్థితి దీపం చుట్టూ చీకట్లే అన్న చందంగా తయారయింది. నగరానికి కూతవేటు సమీపంలో ఉన్న జిల్లా అభివృద్ధిలో మాత్రం అందనంత దూరంలో ఉండి పోయింది. పాలకుల పాపం.. నోరు విప్పని నేతలతో జిల్లా ముఖచిత్రంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లా రూపు రేఖలు.. స్థితిగతులు మార్చి ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాయనుకున్న ప్రాజెక్టులు.. ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి జిల్లాకు చెందిన ప్రాజెక్టులు తెరపైకి రావడం.. ఎన్నికలు ముగిసిన వెంటనే కనుమరుగవడం రెండు మూడు దశాబ్దాలుగా పరిపాటయింది. ప్రస్తుతం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు లేనప్పటికీ శాసనసభలో చర్చంతా జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులపైనే. పాలమూరు ఎత్తిపోతల పథకం, మూసీనది ప్రక్షాళన అంశాలపై అసెంబ్లీలో దుమారం రేగుతుంది. ఇలా సందర్భం వచ్చినప్పుడు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం మినహాయిస్తే ప్రాజెక్టు పనులు పూర్తి కావడంలేదు. జిల్లాకు సాగునీరందటంలేదు.
‘ఉత్తి’పోతలేనా?
ప్రభుత్వం ఏదైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం ఇదే సంప్రదాయం కొనసాగించింది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేకు రూ.6.91 కోట్లు కేటాయించగా నిపుణులు సర్వే చేసి డిజైన్ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకోసం మొత్తం 115 టీఎంసీ నీటిని కేటాయించగా అందులో 45 టీఎంసీల కెపాసిటీతో పరిగి నియోజకవర్గంలో రిజర్వార్లు కట్టేందుకు ప్రణాళిక చేశారు. ఇందులో గండీడ్, కుల్కచర్ల మండలాల పరిఽధిలో నిర్మించే రిజర్వాయర్ సామర్థ్యం 35 టీఎంసీలు కాగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లక్ష్మిదేవిపల్లి, పరిగి మండల పరిధిలోని రావులపల్లి శివారులో జాయింట్‌గా నిర్మించే రిజర్వాయర్ పది టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లాకు 2,46,154 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. అనంతరం అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ సర్కార్ పలుమార్లు డిజైన్ మారుస్తూ వెళ్లింది. చివరకు జిల్లాకు గ్రావిటి ద్వారానే నీరందిస్తామని చెప్పి అదికూడా పూర్తిచేయలేదు. పాలమూరు పరిధిలో రెండు రిజర్వాయర్ల నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ గంపెడు మట్టికూడా తీయలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేసి జిల్లాకు నీరందిస్తామని రెండో బడ్జెట్‌లో పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో లక్ష్మిదేవిపల్లి, రావులపల్లి జాయింట్‌గా పది టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామంటున్నారు. ఇటీవలి బడ్జెట్‌లో పేర్కొన్నట్టుగా కేపీ లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తిచేసి పొలాలు తడపాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
జిల్లాలకు చెందిన ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ కొర్రీలు పెడుతూ కొండెక్కిస్తున్నారు. సర్వేలు, రీడిజైన్లు, కేసులు అంటూ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దశాబ్దాల నుంచి సర్వేలు, ఎన్నికల హామీలకే పరిమితం చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 50 టీఎంసీల కేటాయింపులున్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును గత సర్కారు రీడిజైన్ పేరుతో అటకెక్కించి జిల్లాకు మొండిచేయి చూపింది.
పూడూరు మండల పరిధిలోని రాకంచర్లలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అతితక్కువ ధరకు పేదల నుంచి వంద ఎకరాల భూ సేకరణ చేసి హడావుడిగా ప్రారంభించారు. ఇక్కడ నాలుగైదు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసినా ఏ ఒక్క స్థానికుడికి ఉపాధి కల్పించలేదు.
గండీడ్ మండల పరిధిలోని నంచర్లలో ఏర్పాటు చేస్తామన్న పారిశ్రమిక వాడ శిలాఫలకానికే పరిమితమయింది.
తాండూరులో కంది బోర్డు ఏర్పాటు సైతం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది.
ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యక్తులు సీఎంగా, స్పీకర్‌గా కొనసాగుతున్నవారైనా జిల్లా అభివృద్ధికి పాటుపడాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ప్రాజెక్టుల హామీలు ‘నీటి’మూటలేనా?
సర్వేలకే పరిమితమైన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు
‘ప్రాణహిత–చేవెళ్ల’ కథ కంచికి
అసెంబ్లీ సమావేశాల్లో దుమ్మెత్తిపోసుకుంటున్న పాలక, ప్రతిపక్షాలు
మూసీ ప్రక్షాళనలో జిల్లాకేంద్రం తెరపైకి


