నాయుడుపేట టౌన్: నాయుడుపేట మున్సిపల్ చైర్మన్‌గా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ప్రమాణస్వీకార మహోత్సవం సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనంలో చైర్‌పర్సన్‌గా రాజేశ్వమ్మ చేత తిరుపతి జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్.ప్రసాద్‌రావు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆలస్యంగా వచ్చిన టీడీపీకి చెందిన 14 మందితో పాటు బీజేపీకి చెందిన నలుగురు, స్వతంత్ర అభ్యర్థి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా చైర్‌పర్సన్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించడంతో అంబేడ్కర్ భవనంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులతో పాటు అనేకమంది ఆమెకు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు.
వాయిదా పడ్డ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక
చైర్‌పర్సన్ రాజేశ్వరమ్మతో పాటు 32 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం వైస్‌చైర్మన్ ఎంపికకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా వైస్ చైర్మన్‌గా బీజేపీకి చెందిన కావేరిపాకం కోటేశ్వరరావుకు కేటాయిస్తూ అధిష్టానం తీర్మానం చేసిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రకటన విడుదల చేశారు. దీంతో స్థానిక బీజేపీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కావేరిపాకం కోటేశ్వరరావును ప్రతిపాదిస్తూ పార్టీ బీఫామ్‌ను సైతం ఆర్‌ఓకు అందించారు. సమావేశానికి హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో పాటు పార్టీకి చెందిన కౌన్సిలర్లు మలగుల్లాలు పడి ప్రమాణ స్వీకారం అనంతరం మంతనాలు జరిపారు. అధిష్టానం తిరిగి టీడీపీకి చెందిన వారికే వైస్ చైర్మన్‌గా ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు చెప్పడంతో దీనికి బీజేపీ నాయకులు ఒప్పుకోలేదు. దీంతో అక్కడి నుంచి టీడీపీ, బీజేపీ కౌన్సిలర్లు సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కోరం లేక వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తూ ప్రత్యేక అధికారి ప్రకటించారు. తిరిగి ఎన్నికను మంగళవారం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.


