వెంకటగిరి(సైదాపురం) : ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలకు అంతులేకుండా పోయిందని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం పట్టణంలోని ఎన్‌జేఆర్ భవనంలో విలేకర్లతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు, నేతలపై పోలీసులు దొంగ కేసులు పెట్టడం, ఇబ్బందులకు గురిచేయడం, వారే మళ్లీ విడిపించడం తదితర నాటకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోలీసులే పోషించారన్నారన్నారు. రాజీ చేసుకోవాలని పోలీసులు రాయబారం చేయడం ఎక్కడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే నేరుగా రాజకీయం చేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచినా, టీడీపీ అభ్యర్థులే విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా వైఎస్సార్సీపీకి 35శాతం ఓటింగ్ వచ్చిందని వెల్లడించారు. కనీసం 19వ తేదీన ఎంపీపీ ఎన్నికలనైనా ప్రశాంతంగా జరిపించాలని కోరారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కోడూరు కల్పలతారెడ్డి, పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, నేతలు గూడూరు వెంకటేశ్వర్లు, సేతరాసి బాలయ్య, కౌన్సిలర్ జలగం కామాక్షి, తలపల మల్లికార్జున్, మాజీ కౌన్సిలర్ కందాటి కల్యాణి, పూజారి లక్ష్మి పాల్గొన్నారు.


