తిరుపతి అన్నమయ్యసర్కిల్: శబరిమలై యాత్రకు ప్రత్యేకంగా అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచినట్టు తిరుపతి డిపో మేనేజర్ ఓ.సురేంద్రకుమార్ తెలిపారు. సోమవారం ఆయన చల్లావారిపల్లె, వెదురుకుప్పం నుంచి శబరిమలై యాత్రకు బయలుదేరిన రెండు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శబరిమలై యాత్రకు తిరుపతి డిపోలో ఇప్పటికే ఏడు బస్సులు బుకింగ్ అయ్యాయన్నారు. యాత్రకు సంబంధించిన బస్సుల కోసం ఏడీసీ రెడ్డెప్ప 7382881507, అసిస్టెంట్ మేనేజర్ వేణు 8919188133, డిపో మేనేజర్ 9959225670 నంబర్లలో సంప్రదించొచ్చని చెప్పారు. ఆయన వెంట అసిస్టెంట్ ఇంజినీర్ జ్యోతిరెడ్డి, సూపర్‌వైజర్లు తదితరులు ఉన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
తిరుపతి సిటీ: పుత్తూరు వేదికగా ఈనెల 21 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. గతనెల అక్టోబర్‌లో జరిగిన 70వ ఎస్‌జీఎఫ్ అండర్ 19 బాలిక విభాగంలో ప్రతిభ చూపి జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికై న విద్యార్థులు దేవిక, శ్రీహర్ష, అనూష, హారిక, హేమశ్రీ, విష్ణుప్రియలను ప్రిన్పిపల్ డాక్టర్ భువనేశ్వరి, పీడీ సాయి సుమతి, అధ్యాపకులు అభినందించారు.
శ్రీకాళహస్తి పురపోరుకు 335 నామినేషన్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పురపోరుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 335 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో చైర్‌పర్సన్‌కు 19, వార్డు సభ్యుల స్థానాలకు 316 నామినేషన్లు వచ్చినట్లు పురపాలక సంఘ అధికారులు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చంద్రగిరి: పూతలపట్టు–నాయుడుపేట జాతియ మార్గంలోని రాయలపురం సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి (45) దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం.. రాయల్‌పురం సమీపంలో జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిపై పలు వాహనాలు దూసుకెళ్లడంతో గుర్తుపట్టలేనంతగా మృతదేహం ఛిద్రమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పక్కకి తొలగించి కేసు నమోదు చేశారు.
బాలిక ఆచూకీ లభ్యం
తిరుపతి క్రైం: తిరుపతి పట్టణంలోని కొత్తపల్లి, కట్టకిందవూరు ప్రాంతానికి చెందిన బత్తుల మోక్షిత (10) చూకీ లభ్యమైంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సమీపంలోని దుకాణానికి చాక్లెట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అప్రమత్తమైన అలిపిరి పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, మోక్షిత తల్లి ఉషారాణి గతంలో ఇద్దరు కుమార్తెలను వదిలి శ్రీకాకుళం వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలో తన స్నేహితురాలు వరలక్ష్మిని తిరుపతికి పంపించి, మోక్షితను తన వద్దకు తీసుకురావాలని కోరినట్లు సమాచారం. దీంతో వరలక్ష్మి బాలిక వద్దకు వెళ్లి, తన వెంట తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో మోక్షిత సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీకాకుళంలోని తన తల్లి ఉషారాణి వద్దకు చేరింది. బాలిక అదృశ్యం వ్యవహారానికి తెరపడింది.
గుర్తు తెలియని వాహనం ఢీ
– ఇంటర్ విద్యార్థి దుర్మరణం
పీలేరు రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన సోమవారం స్థానిక కడప రోడ్డు మార్గంలో మదనపల్లె – తిరుపతి ఫ్లైఓవర్‌పై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం, భాకరాపేట గాండ్లపల్లెకు చెందిన హరినాథ కుమారుడు కిరణ్‌కుమార్(17) పీలేరు పట్టణంలోని శ్రీమేథ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం మదనపల్లె – తిరుపతి ఫ్లైఓవర్‌పై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


