12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో నివేదన
పుష్పయాగంలో పాల్గొన్న చెవిరెడ్డి దంపతులు
వైఖానస ఆగమోక్తంగా పుష్ప యాగం
సప్తవర్ణ శోభితం..
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం జరిగిన పుష్పయాగ మహోత్సవం సప్తవర్ణ శోభితంగా సాగింది. సాయంత్రం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో ప్రత్యేకంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పుష్పయాగానికి ముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకించారు. ఆ తర్వాత పుష్ప యాగ మహోత్సవాన్ని కన్నులపండువుగా నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి తీసుకు వచ్చిన 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి వారికి నివేదన చేసి భక్తితో మంత్ర పఠనం చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చిన చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు, మాను సంపంగి, తులసి, దవనం, మరవం, బిల్వం, పన్నీరాకు వంటి వాటిని పుష్పయాగంలో ఉపయోగించారు. పుష్పయాగానికి సుమారు 3 టన్నుల పుష్పాలను వినియోగించారు.
భక్తులకు ప్రసాదంగా అందజేత
పుష్పయాగంలో నివేదించిన పుష్పాలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. అరుదైన పుష్పాలు చేతికి రావడంతో భక్తులు ఆనందంగా స్వీకరించి భక్తితో తమ వెంట తీసుకుని వెళ్లారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.


