జాగ్రత్తలు తీసుకోండి
చలి తీవ్రత పెరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడం ముఖ్యం. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోస సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆస్తమా, శ్వాసకోస సమస్యలున్న వారు మందులను క్రమంతప్పకుండా వాడాలి. చల్లని వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు ధరించాలి. – డాక్టర్ ఎమ్.హారిక,
జనరల్ ఫిజీషియన్, రుయా ఆస్పత్రి, తిరుపతి
సాక్షి, తిరుపతి: జిల్లాలో చలి తీవ్రత గత కొన్ని రోజులుగా పెరిగింది. దీపావళి పండుగ తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. పగటిపూట ఎండ ప్రభావం అంతగా లేకపోగా.. సాయంత్రం వేళ నుంచే చల్లని గాలులు వీస్తున్నాయి. రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. వృద్ధులు, రోగులు ఇబ్బందిపడుతున్నారు. పగటిపూట 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతుండగా రాత్రి వేళల్లో మాత్రం కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. జిల్లా కేంద్రమైన తిరుపతిలో సోమవారం 30/20 డిగ్రీల సెంట్రీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా డిసెంబర్‌లో ఇలాంటి వాతావరణం ఉంటుంది. గతేడాది ఇదే నవంబర్ మాసంలో ఉష్ణోగ్రతలు 35/26 డిగ్రీలు నమోదుకాగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సుమారు 5 డిగ్రీలు పడిపోయాయి. ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ప్రభావంతో గత నాలుగు నెలలుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ అక్టోబర్ నుంచి వరుస తుపాన్లు అర్నబ్, మురసు రావడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. గాలిలో తేమశాతం పెరిగింది. చలి తీవ్రత పెరగడంతో దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చల్లని గాలుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారు.


