శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడులు చేశారని తెలిపారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితులు బీహార్, ఆఫ్ఘనిస్తాన్, చివరకు పాకిస్తాన్ లో కూడా లేవని వాపోయారు. సర్పంచ్, కౌన్సిలర్ పదవులను బెడ్‌షీట్లు వేలం వేసినట్లు వేలం వేస్తున్నారని విమర్శించారు. రూ.15 లక్షలు పెట్టుకుంటే అధికారులకు ఇంత, అడ్డుకునేందుకు ఎంత, నామినేషన్ పరిశీలనలో తొలగించేందుకు ఇంత, ఇతర ఖర్చులకు ఇంత అంటూ కూటమి నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు.
నామినేషన్లు చించేసి దాడులు
ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ఆదివారం ఉదయం నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను టీడీపీ గూండాలు చించివేసి దాడులకు దిగారని ఆరోపించారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గెలుపోటములను ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సి ఉండగా దాడులు చేయడం, నామినేషనన్ పత్రాలు చించడం తగదన్నారు. ఎన్నికల ప్రక్రియను ఆర్థిక సంబంధాలతో ముడిపెట్టడం సరైన సంస్కృతి కాదని పేర్కొన్నారు.
ఓట్ల లెక్కింపు వరకు ఇబ్బందులే
ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయాలంటే యు ద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దాడులు ఎదుర్కొని నామినేషన్ వేసినా, వాటిని తిరస్కరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.అక్కడ కూడా తప్పించుకుంటే ఉపసంహరణకు బలవంతం చేస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ అధిగమించి ఎన్నికల వరకు నిలబడినా, ప్రజలు వేసిన ఓట్లను తారుమారు చేస్తూ కౌంటింగ్ సమయంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్ధతులు సరైనవి కావని అన్నారు.


