తిరుపతి రూరల్ : జైలు నుంచే జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి 1,780 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పెళ్లకూరు మండల జెడ్పీటీసీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆదివారం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్న కామిరెడ్డికి చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆయన చెవిరెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను ఘనంగా సత్కరించారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, తిరుపతి రూరల్ జెడ్పీటీసీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో కామిరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా పరిషత్‌లో ప్రజా సమస్యలపై బలంగా గళమెత్తాలని కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తిరుపతి రూరల్ జెడ్పీటీసీ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి సూచించారు. కార్యక్రమంలో పెళ్లకూరు మండలానికి పలువురు వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు.
జోరందుకున్న
నామినేషన్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలకు రెండవ రోజు నామినేషన్లు జోరందుకున్నాయి. పోటాపోటీగా రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. తొలి రోజు చైర్మన్ స్థానానికి 1, వార్డు కౌన్సిలర్ స్థానాలకు 15 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు తెలిపారు. రెండవ రోజు ఆదివారం చైర్మన్ స్థానానికి 4 నామినేషన్లు, వార్డు సభ్యులకు 120 నామినే షన్లు వేశారు. ఇందులో భాగంగా రెండవ రోజు వైఎస్సార్ సీపీ 57, టీడీపీ 43, బీజేపీ 9, జనసేన 7, సీపీఎం 1, స్వతంత్రులు 2, ఇతరులు 1 నామినేషన్ చొప్పున దాఖల య్యాయి. రెండవ రోజు చైర్మన్ స్థానానికి వైఎస్సార్ సీపీ 3, టీడీపీ 1 నామినేషన్ దాఖలయ్యాయి. మొత్తం రెండు రోజులు కలిపి చైర్మన్ స్థానానికి 5 నామినేషన్లు, వార్డు సభ్యులకు అన్ని పార్టీలు కలిసి 135 నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి వెల్లడించారు.
పీజీఆర్‌ఎస్ రద్దు
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమా న్ని నిర్వహించడం లేదన్నారు.


