తిరుమల ఘాట్‌ రోడ్డులో బైక్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్‌ రోడ్డులో బైక్‌ బోల్తా

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

– యువకుడి మృతి

తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ఆదివారం ఆర్టీసీ బస్సును అధిగమించే క్రమంలో బైక్‌ అదుపుతప్పి బోల్తాపడింది. కింద పడి తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతికి చెందిన పునీత్‌ తిరుమల నుంచి ద్విచక్ర వాహనంపై మొదటి ఘాట్‌ రోడ్డుగా కిందకు దిగుతున్నాడు. వినాయస్వామి ఆలయం దాటిన తర్వాత మలుపు వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్‌ టేక్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. సమీపంలోని వాహనచోదకులు గుర్తించి టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఘాట్‌ రోడ్డు భద్రతా సిబ్బంది గాయపడిన పునీత్‌ను అంబులెన్స్‌లో రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పునీత్‌ మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు పరిశీలించారు. ప్రమాదంపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయ బోర్డు సభ్యత్వానికి పొక్కల ఉషారాణి రాజీనామా

తిరుపతి రూరల్‌ : పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలోని శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయ బోర్డు సభ్యురాలు పొక్కల ఉషారాణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ స్వామి వారి సేవలో భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆలయ బోర్డు సభ్యురాలి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఈవో అందుబాటులో లేనందున తన రాజీనామాను సోమవారం అందజేయనున్నట్టు వెల్లడించారు. మొగరాల పంచాయతీలో సర్పంచ్‌ అభ్యర్థిగా పొక్కల ఉషారాణి భర్త చెంగల్రాయులు జనసేన మద్దతుతో బరిలోకి దిగాలనుకోగా అందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అంగీకరించలేదన్న కారణం చేతనే ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది.

విద్యార్థి ఆచూకీ లభ్యం

నాయుడుపేట టౌన్‌ : కనిపించకుండా పోయిన పట్టణంలోని అమరాగార్డెన్‌ వీధికి చెందిన విద్యార్థి అబ్దుల్లా మునాఫ్‌ ఆచూకీ లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఆదివారం వెల్లడించారు. బాలుడి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బాలుడి తల్లిదండ్రులు పట్టణంలోని పలు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో అతను రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి రైలులో వెళ్లినట్టు గుర్తించారు. అతను విజయవాడ వెళ్లి తిరిగి చైన్నెకి వెళుతున్నట్టు స్నేహితుడికి సమాచారం అందించి అక్కడికి చేరుకున్నట్లుగా గుర్తించారు. మునాఫ్‌ స్నేహితుడికి తల్లిదండ్రులు నచ్చజెప్పి నాయుడుపేటకు తీసుకురావాలని కోరినట్లు తెలిపారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి పట్టణ శివారులోని సాయినగర్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. గుర్తుతెలియని దొంగలు సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీ చేశారు. పోలీసుల కథనం మేరకు.. సాయినగర్‌కు చెందిన గజేంద్రనాయుడు కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసుకుని కొద్ది రోజుల క్రితం చైన్నె వెళ్లారు. శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని సమీపంలో నివసించే ఓ వ్యక్తి గుర్తించి గజేంద్రనాయుడు, శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంటికి చేరుకున్న గజేంద్రనాయుడు కుటుంబ సభ్యులు సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement