తిరుమల:తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగం నిర్వహించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ వద్ద ఆచార్య రుత్విక్వరణం చేశారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. సోమవారం పుష్పయాగాన్ని కనుల పండువగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం చేస్తారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.


