నగర ప్రజల సమస్యలపై పోరాడుదాం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అభినయ్‌రెడ్డి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ‘మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయామని కుంగిపోవద్దు.. మన ఐక్యతే బలం.. తిరుపతి నగరాభివృద్ధిలో భాగంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించండి. వారికి బాసటగా నిలవండి’ అంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కానీ పార్టీ కోసం నిలబడిన ప్రతిఒక్కరూ మన దృష్టిలో విజేతలే అని ప్రోత్సహించారు. ముగ్గురు కార్పొరేటర్ల పాటు ఓటమి చవిచూసిన వారందరూ ఆయా డివిజన్లలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడి ఆ ప్రాంత సమస్యలను గుర్తించాలని చెప్పారు. ఎన్నికల సమయంలో ఎదురైన సవాళ్లు, అడ్డంకుల మధ్య కూడా పార్టీ పట్ల నిబద్ధతతో, ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తుచేసుకున్నారు.


