తిరుపతి అర్బన్: సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన అవగాహన ఉండాలని జేసీ గోవిందరావు సూచించారు. తిరుపతి కచ్చపి స్టేడియంలో శుక్రవారం తిరుపతి, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్వోలు, ఏఆర్వోలు, పీవోలు, ఏపీవోలకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి నోటిఫికేషన్ మొదలుకొని నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. డీపీవో సుశీలాదేవి, తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, డీఎల్‌ఈఓ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 70,460 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,318 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో రూ.5.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


