నాయుడుపేట టౌన్: రాష్ట్రంలో టీడీపీ వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ఆ పార్టీ పతనం ఆరంభమైందని, ఇందుకు నిదర్శనం స్థానిక సంస్థల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి దక్కిన ఘన విజయమేనని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నాయుడుపేటలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన గుండె ధైర్యంతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి దీటుగా పోరాడమన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయమే ఇందుకు నిదర్శనమన్నారు. పంచాయతీల్లో ఖాకీల జులుం ప్రదర్శిస్తే ప్రజలు తిరగబడడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. 2029 ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. నాయుడుపేట మున్సిపల్ పీఠం సాధించుకునేందుకు తనతో పాటు ముందుండి నడిపించిన చైర్‌పర్సన్ భర్త తంబిరెడ్డి జనార్దన్, ఆయన కుమారుడు, టీఎంఆర్ గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్‌రెడ్డి పడిన కష్టం అంతా ఇంత కాదన్నారు. ఈ సందర్భంగా వారిరువురిని సంజీవయ్య శాలువలు కపి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, లీగల్ సెల్ కన్వీనర్ చదలవాడ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


