శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామికి అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్ సి.రెడ్డి, సతీమణి మణి సుచరితరెడ్డి మంగళవారం పట్టు వస్త్రాలు వితరణగా అందజేశారు. వాటిని పట్టణానికి చెందిన ముక్కంటి ఆలయ పాలక మండలి మాజీ సభ్యురాలు డాక్టర్ ప్రమీలమ్మ ఈవో బీకే వెంకటేశులుకు అందజేశారు. ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
బిస్కెట్లు ఆశజూపి..!
బుచ్చినాయుడుకండ్రిగ: పదేళ్ల బాలికకు బిస్కెట్లు ఆశ చూపి, మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై అపహరించిన ఘటన వరదయ్యపాళెం మండలంలోని ఓ గిరిజన కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. వరదయ్యపాళెం మండలం, చెన్నవారిపాళెం దళితవాడకు చెందిన పోలయ్య(41) శ్రీసిటీలోని కోబెల్కో కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం పోలయ్య ఉబ్బలమడుగు జలపాతం సందర్శించి స్వగ్రామానికి వెళ్తుంతుండగా రోడ్డు పక్కన ఉన్న పదేళ్ల బాలికను గమనించాడు. బాలికకు బిస్కెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి, నమ్మించి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. కుక్కంబాకం గ్రామ పరిధిలోని తెలుగుగంగ కాలువ రోడ్డు మార్గంలో ఉన్న మర్రిచెట్టు వైపు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బాలిక భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలో కట్టెలు కొట్టుకుంటున్న వారు విని ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇది గమనించిన నిందితుడు పోలయ్య ద్విచక్ర వాహనాన్ని వదిలి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. ద్విచక్ర వాహనంలోని గుర్తింపు కార్డుల ఆధారంగా నిండితుడిని గుర్తించినట్లు తెలిపారు.


