తిరుపతి ఎడ్యుకేషన్ : ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. డీఈఓ కార్యాలయంలో మంగళవారం ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై డీవైఈఓలు, ఎంఈఓలు, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ వివిధ కారణాలతో మధ్యలోనే చదువు మానేసిన వారు, పది, ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను గుర్తించి వారికి ఓపెన్ స్కూల్ ద్వారా తిరిగి చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయా మండల పరిధిలో ఇలాంటి వారిని గుర్తించి ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ పొందేలా అవగాహన కల్పించాలని సూచించారు.


