రేణిగుంట: మండలంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి రోగుల వద్ద అధిక మొత్తంలో వసూలు చేస్తున్న వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ముందుగా ఆస్పత్రిలో చేర్పించుకునేటప్పుడు ఒకరేటు.. తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరో రేటు చెప్పి మాయ చేస్తున్నారని మండిపడుతున్నారు. బాధితుల కథనం మేరకు.. నారాయణవనం మండలం, కసిమ్మిట్టకు చెందిన దేవానమ్మ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆదివారం పేషెంట్ కండిషన్ సీరియస్‌గా ఉందని, రూ.4 లక్షలు చెల్లించి తీసుకు వెళ్లాలని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవానమ్మ కుమారుడు రాజశేఖర్ మాట్లాడుతూ అడ్మిషన్ చేసుకునేటప్పుడు వైద్యానికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు అవుతుందని హాస్పిటల్ సిబ్బంది తెలిపారని, 15 నిమిషాల వ్యవధిలోనే ఆపరేషన్ పూర్తయిందని చెప్పి ఐసీయూకు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఉదయం వచ్చి పేషెంట్‌ను చూడవచ్చని పేర్కొన్నట్టు చెప్పారు. ఆదివారం ఉదయం వైద్యుల్ని సంప్రదించగా.. ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, పైగా సాయంత్రానికి పేషెంట్ కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్పారని తెలిపారు. రోగిని డిశ్చార్జ్ చేయాలని కోరితే రూ.4 లక్షలు కట్టాలంటూ బిల్లు ఎత్తి చేతిలో పెట్టారని వాపోయాడు. ఆ బిల్లులో హాస్పిటల్ లోగో, సీలు, సంతకం లేదన్నారు. అనధికారిక బిల్లు ఇవ్వడంపై ప్రశ్నిస్తే సిబ్బంది ఎటువంటి సమాధానం ఇవ్వలేదని, ముందుగానే తమకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ఉంటే తాము అడ్మిట్ చేసే వాళ్లం కాదని తెలిపాడు. ఇప్పుడు అంత డబ్బు కట్టమంటే ఏమి చేయాలో అర్థం కావడం లేదని వాపోయాడు. విషయం బయటికి రావడంతో సోమవారం ఆరోగ్యశ్రీలో పెడతామని చెప్పి రూ.లక్ష చెల్లించమంటున్నారని, ఆరోగ్యశ్రీ వర్తిస్తే డబ్బు ఎందుకు చెల్లించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


