కూటమి కుట్రలకు ఎదురొడ్డి గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ప్రతి దశలో పోరాట స్ఫూర్తి చూపిన వైనం
అండగా నిలిచిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు
ప్రాదేశిక ఎన్నికల గెలుపుతో కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం
ఎన్నికల అక్రమాలతో పరువు
నిలుపుకున్న అధికార కూటమి
నైతిక విజయం వైఎస్సార్సీపీదే అంటున్న రాజకీయ విశ్లేషకులు
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో ఉన్నది రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం. అధికారంలో ఉంటే ఎంతటి అరాచకాలు సృష్టిస్తారో తాజా ప్రాదేశిక ఎన్నికలే దీనికి నిదర్శనం. నామినేషన్ల దశ మొదలు పోలింగ్, చివరకు గెలిచిన తరువాత డిక్లరేషన్ ఇచ్చే వరకు ప్రతి దశలోనూ దౌర్జన్యాలు, కుట్రలకు తెరదీశారు. ఇన్ని చేసినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలు నిలబడి.. తలబడి గెలవడం ఆ పార్టీలో నయా జోష్‌ను తీసుకువచ్చింది. కూటమి పార్టీలకు ఎన్నికల, పోలీసు అధికారులు తోడవడంతో ఎదురైన తీవ్ర సవాళ్లను సైతం ఎదుర్కొని ఆరుగురు జెడ్పీటీసీ, 84 ఎంపీటీసీ స్థానాలు గెలవడం ఆ పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసింది. ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతోందన్న భయంతో దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకున్న కూటమి పార్టీలు పోలింగ్ జరిగిన స్థానాల్లోనూ అదే పంథా కొనసాగించారు. కేవీబీపురం జెడ్పీటీసీ స్థానాల్లాంటి చోట వైఎస్సార్‌సీపీ గెలిచినా తిరకాసు పెట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను సైతం రీకౌంటింగ్ పేరుతో టీడీపీ ఖాతాలో వేసుకుని రాక్షసానందం పొందారు. ఇలాంటి ఘటనలతో గెలిచిన స్థానాలు తగ్గినా వైఎస్సార్‌సీపీ క్యాడర్ బలమేంటో ఈ ఎన్నికల్లో నిరూపితమైందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ప్రతిదశలో పోరాట స్ఫూర్తి
ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నిలవకూడదని అధికార కూటమి గట్టిగా ప్రయత్నించింది. దాడులు, అక్రమ కేసులు, అవసరమైన పత్రాలు అందకుండా చేయడం ఒకటేమిటి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అయినా సరే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు ప్రతి దశలో తమ పోరాట స్ఫూర్తిని చూపించారు. 31 జెడ్పీటీసీ, 302 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగేలా చేయడంతోనే వైఎస్సార్‌సీపీ తొలి విజయం సాధించినట్టయ్యింది. ఇంటింటికీ ప్రచారం సైతం చేయనీకుండా పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నా ఎక్కడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రచారం చేశారు. వైఎస్సార్‌సీపీ అభిమానులకు ప్రతి దశలో ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరలు అండగా నిలిచారు.
వైఎస్సార్‌సీపీకి 43.6 శాతం ఓట్లు
జిల్లాలో జరిగిన 31 జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 7,59,241 ఓట్లకుగాను వైఎస్సార్‌సీపీ సింబల్ మీద 3,30,864 వ్యాలిడ్ ఓట్లు పడ్డాయి. వైఎస్సార్‌సీపీకి 43.6 శాతం ఓట్ల షేర్ లభించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే మరో 3 శాతం ఓట్లు కూటమి కుట్రలతో ఇన్‌వ్యాలిడ్ చేయగా దాదాపు ఈ ఓట్లన్ని వైఎస్సార్‌సీపీకి చెందినవే. అంటే మొత్తం 46.6 శాతం ఓట్లు పడ్డాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఓడించేందుకు సరైన ఓట్లను సైతం చెల్లనివిగా మార్చారు. మరోవైపు విద్యుత్ అంతరాయం కలిగించడం, కౌంటింగ్ ఏజెంట్లపై దౌర్జన్యం చేసి వైఎస్సార్‌సీపీ ఓట్లను సైతం టీడీపీకి పడ్డట్లు నమోదు చేశారు. ఇందుకు తొట్టొంబేడు జెడ్పీటీసీ, తాటిపర్తి ఎంపీటీసీ స్థానాల కౌంటింగే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే సమయంలో టీడీపీకి వచ్చిన ఓటు శాతం 43.7 మాత్రమే. జనసేనకు 5.1 శాతం, బీజేపీ 3.7 శాతం ఓట్లు జెడ్పీటీసీ ఎన్నికల్లో పడ్డాయి. దొంగ ఓట్లు, రిగ్గింగ్ జరగకుండా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులంతా వచ్చి నిర్భయంగా ఓటు వేసే అవకాశం వచ్చి ఉంటే వైఎస్సార్‌సీపీ ఓట్ల శాతం ఎంత పెరిగేదో ఆర్థం చేసుకోవచ్చు.
నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే
ప్రాదేశిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కుట్రలు చేసి గెలిచి కూటమి ప్రభుత్వం పరువు నిలుపుకుంది. వైఎస్సార్‌సీపీకి వచ్చిన సీట్లు, ఓట్లు చూసి ఆ పార్టీ నేతలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించుకుంటున్నారు. మరోవైపు ప్రాదేశిక ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు చేసిన కుట్రలు, దౌర్జన్యాలను ప్రజలు గమనించారని, సరైన సమయంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పుకొస్తున్నారు.
రెండు సార్లు జెడ్పీటీసీ
చిన్నగొట్టిగల్లు జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలం యుగంధర్‌రెడ్డి పోటీ చేసి గెలుపొందారు.
వ్యక్తిగత వివరాలు
పేరు : బాలం యుగంధర్‌రెడ్డి
సెగ్మెంట్ : చిన్నగొట్టిగల్లు
నియోజకవర్గం : చంద్రగిరి
విద్యార్హత : ఇంటర్మీడియెట్
కుటుంబ వివరాలు : భార్య బాలం సంధ్య,
కుమారుడు అజయ్
రాజకీయ ప్రస్థానం: బాలం యుగంధర్‌రెడ్డి రైతు కుటుంబానికి చెందిన వారు. 1987–92 మధ్య సింగిల్‌విండో చైర్మన్‌గా, 1995 నుంచి 2000 వరకు నెల్లుట్లవారి పల్లి పంచాయతీ సర్పంచ్‌గా, 2001 –2006 కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీగా విజయం సాధించారు. 2021 నుంచి 2029 వరకు ఎంపీపీగా సేవలందించారు. మళ్లీ ఇప్పుడు వైఎస్సార్సీపీ తరఫున జడ్పీటీసీగా గెలుపొందారు.
తండ్రికి తగ్గ తనయుడు
వైఎస్సార్సీపీలో ప్రాదేశిక జోష్


