● చిన్న ఉపగ్రహాలకు ప్రయోగ కేంద్రం.. కులశేఖర్‌పట్నం | - | Sakshi
Sakshi News home page

● చిన్న ఉపగ్రహాలకు ప్రయోగ కేంద్రం.. కులశేఖర్‌పట్నం

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

● చిన్న ఉపగ్రహాలకు ప్రయోగ కేంద్రం.. కులశేఖర్‌పట్నం

సూళ్లూరుపేట: భారత అంతరి పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్నతరహా ఉపగ్రహ ప్రయోగాల కోసం తమిళనాడులోని తూత్తుకుడి సమీపంలో కులశేఖర్‌పట్నం స్పేస్‌ పోర్టు నిర్మాణం పూర్తి కావస్తోంది. 2027 ప్రథమార్థనంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కులశేఖర్‌పట్నంలో తమిళనాడు ప్రభుత్వం 2,300 ఎకరాలు సేకరించి ఇస్రోకు అప్పగించడంతో అందులో రూ.986 కోట్ల వ్యయంతో ప్రయోగకేంద్రాన్ని తుది దశకు తీసుకొచ్చారు. శ్రీహరికోట నుంచి రాకెట్‌లు ప్రయోగించాలంటే ముందుగా శ్రీలంక ఏరోనాటిక్స్‌కుతో పాటు అక్కడ ఆర్మీకి కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వారి అనుమతిని తప్పకుండా తీసుకోవాలి. రాకెట్‌ నింగికి ప్రయాణించే సమయంలో ఏదైనా అవాంతరం జరిగి పేలితో ఆ శకలాలు శ్రీలంక మీద పడే అవకాశాలుండడంతో శ్రీలంక మీదుగా ప్రయాణించే రాకెట్‌ను హిందూ మహాసముద్రం మీదకు మళ్లించాలంటే యూటర్న్‌ తీసుకుని ప్రయాణించేలా చేస్తారు. అలాగే శ్రీహరికోట నుంచి సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌ (సూర్య సమకాలిక ధృవ కక్ష్య) ఉపగ్రహాలను పంపేటపుడు రాకెట్‌ విడి భాగాలు భూభాగాలపై పడకుండా ప్రయోగ మార్గాన్ని మళ్లించాల్సి ఉంది. దీని వల్ల ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం తగ్గుతుంది. ఈ విధంగా చేయడం వల్ల రాకెట్‌కు అదనంగా ఇంధన వ్యయం పెరుగుతుంది.

భారతదేశానికి రెండవ స్పేస్‌ పోర్ట్‌ కులశేఖరపట్నం ప్రయోగ కేంద్రం

కులశేఖర్‌పట్నం ప్రత్యేకత ఇదీ

కులశేఖర్‌పట్నం ప్రయోగ కేంద్రం భౌగోళికంగా రాకెట్‌ ప్రయోగాలకు ఎంతో అనుకూలంగా ఉంది. సాంకేతికపరంగా చూస్తే కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరి అనుమతులు అవసరం లేకుండా ప్రయోగాలు చేసుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. హిందూ మహాసముద్రం మీదుగా దక్షిణ ధృవ కక్ష్య దిశగా రాకెట్‌ ప్రయాణం సాగేలా ఉంది. 300 నుంచి 500 కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి సునాయాసంగా ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇంధన వ్యయం చాలా వరకు తగ్గుతుంది. ఈ కేంద్రం నుంచి ప్రధానంగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలను వాణిజ్యంపరంగా చేయడానికి అనువుగా ఉండడంతో ఇస్రో ఇక్కడి నుంచి వాణిజ్యపరమైన ప్రయోగాలను చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. వీలైతే పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు, ప్రయివేట్‌ స్టార్టప్‌ సంస్థలకు చెందిన రాకెట్లు, ఉపగ్రహాలు కూడా కులశేఖర్‌పట్నం నుంచి ప్రయోగించుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని, భారతదేశానికి రెండో రాకెట్‌ ప్రయోగ కేంద్రం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement