దారి కాచిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దారి కాచిన మృత్యువు

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

● మరి కొద్దిక్షణాల్లో ఇంటికి చేరుకునేలోపే గుర్తుతెలియని వాహనం ఢీ ● ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి ● పెద్ద దిక్కుని కోల్పోయిన కుటుంబం

వెంకటగిరి రూరల్‌: మృత్యువు దారికాచింది. మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకునే లోపు రోడ్డు ప్రమాదానికి గురి చేసింది. ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఆ కుటుంబాన్ని వీదిన పడేసింది. ఈ విషాద ఘటన పెంచలకోన–ఏర్పేడు జాతీయ రహదారిలోని కలపాడు తెలుగంగ కాలువ వంతెన సమీపం వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసు కథనం.. మండలంలోని కలపాడు గ్రామానికి చెందిన గొర్ల కృష్ణయ్య(40) పట్టణంలోని ఓ డాబాలో పనిచేస్తుంటారు. శుక్రవారం డక్కిలి నుంచి స్వగ్రామం కలపాడుకు తన ద్విచక్ర వాహనంపై గ్యాస్‌ సిలిండర్‌ పెట్టుకుని బయల్దేరాడు. కలపాడు గ్రామ సమీపం వద్ద ఉన్న తెలుగంగ కాలువ వద్ద ఓ కారు అటువైపు వెళ్తున్న గేదెలను ఢీకొంది. వెనుకనే ద్విచక్ర వాహనంపై వస్తున్న కృష్ణయ్య అదుపుతప్పి ఆ గేదెలను ఢీకొని కిందపడిపోయాడు. వెంటనే లేచి తన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుతుండగా అటువైపు వస్తున్న ఓ గుర్తుతెలియని వాహనం కృష్ణయ్యను ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణయ్య గాల్లో ఎగిసి దూరంగా పడిపోయి.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరి కొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకునేలోపే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఇంటి పెద్ద దిక్కు మృతిచెందడంతో తమకు దిక్కెవరు దేవుడా అంటూ గుండెలవిసేలా విలపించారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement