తిరుపతి మంగళం : ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం అని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. వాటిని ఉపయోగించిన అనంతరం నిర్లక్ష్యంగా పడవేయడం వల్ల నేల, నీరు, గాలి కలుషితవుతోందన్నారు. పాత ఎలక్ట్రానిక్ వస్తువులను సాధారణ చెత్తలో వేయకుండా అధీకృత ఈ–వ్యర్థాల సేకరణ కేంద్రాలకు మాత్రమే అందించాలని తెలిపారు. కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు అతికానాజ్, స్వర్ణలత, పరిపాలన అధికారులు విజయకుమార్, విజయప్రశాంతి పాల్గొన్నారు.


