తిరుపతి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. బుధవారం తిరుపతి ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కశాశాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఈ క్రమంలో కలెక్టర్‌తోపాటు ఎస్పీ సుబ్బరాయుడు ఎన్నికల సామగ్రిని పరిశీలించడంతోపాటు పీవోలు, ఏపీవోలకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. 31 జెడ్పీటీసీ, 302 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. 11,70,397 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు. జిల్లాలో సుమారు 760 పోలింగ్ స్టేషన్లను సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించి వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని, మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షించనున్నమని తెలిపారు. ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా మైక్రో ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల సున్నితత్వం మేరకు ప్రత్యేక స్ట్రైకింగ్ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని, బాలింతలు, గర్భిణిలు, వృద్ధులు, దివ్యాంగులు త్వరగా ఓటు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు, ఓటరు స్లిప్పు లేనివారు ఎన్నికల సంఘం నిర్దేశించిన 22 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆమేరకు బుధవారం ప్రత్యేక ఆదేశాలు పోలీసులకు ఇచ్చామని వెల్లడించారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనే అవకాశముందని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వసతులు కల్పించామన్నారు. ప్రతి ఓటరు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. తిరుపతి ఆర్‌డీఓ రామ్మోహన్, జెడ్పీ డిప్యూటీ సీఈవో రమణప్రసాద్, డ్వాడా ఏపీడీ ప్రభావతి, తిరుపతి రూరల్ తహసీల్దార్ జనార్ధన్ పాల్గొన్నారు.
తిరుపతి రూరల్‌లో హర్షిత్‌రెడ్డి
తిరుపతి రూరల్ మండలంలో పోటీ తీవ్రంగా ఉంది. మండలంలో 40 ఎంపీటీసీలు ఉన్నప్పటికీ టీడీపీ మోసపూరితంగా 11 స్థానాలను కై వసం చేసుకుంది. న్యాయబద్ధంగా వైఎస్సార్‌సీపీ ఒక స్థానంలో మాత్రమే ఏకగ్రీవంగా నిలిచింది. మిగిలిన 28 స్థానాల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు తిరుపతి రూరల్ మండలంలోని జెడ్పీటీసీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే చెవిరెడి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పోటీలో ఉన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఇంటింటా సంక్షేమ ఫలాలు అందించిన నేపథ్యంలో తప్పకుండా విజయం సాధిస్తామనే ధీమాతో ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు తిరుపతి ఎస్‌జీహెచ్ ఆర్డ్స్ కళాశాలలో బుధవారం ఎన్నికల సామగ్రిని చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్‌లకు తరలించారు. దీంతో కళాశాలలో ఎన్నికల హడావుడి చోటుచేసుకుంది.


