యాదమరి: ఆ ఇంటిలో విధి ఆర్పిన దీపం.. మరో ఇద్దరి ఇళ్లల్లో వెలుగులు నింపింది. కళ్ల ముందే చేతికొచ్చిన కొడుకు అకాల మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్నా ఆ తండ్రి, కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఆరు నెలల క్రితం కన్నతల్లి మరణించగా నేత్రదానం చేసిన ఆ కుటుంబం, ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన కొడుకు కళ్లను కూడా దానం చేసి మానవత్వాన్ని చాటుకుంది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం యాదమరి మండలంలో చోటు చేసుకుంది. జోడిచింతల గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆయన రెండో కుమారుడు సందీప్(34) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం రాత్రి సందీప్ ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను డీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కన్నకొడుకు విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి ఆ తండ్రి, అతని కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కొడుకు ఇక లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకుంటూనే సందీప్ కళ్లతో మరొకరికి కంటి చూపు ప్రసాదించాలని కుటుంబ సభ్యులు భావించారు. సరిగ్గా ఆరు నెలల క్రితమే సందీప్ తల్లి కూడా చనిపోయింది. అప్పట్లో ఆమె నేత్రాలను దానం చేశారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ కుమారుడి కళ్లను సైతం దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆరు నెలల వ్యవధిలోనే తల్లి, కుమారుడి కళ్లను దానం చేసిన ఆ కుటుంబంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సందీప్ మరణంతో జోడిచింతల గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
నిజాయితీగా ఎన్నికలు
జరిగి ఉంటే ఫ్యాన్ గెలిచేది
చిత్తూరు కార్పొరేషన్: నగరపాలక సంస్థ ఎన్నికలు నిజాయితీగా జరిగి ఉంటే ఫ్యాన్ కచ్చితంగా గెలిచేదని వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి చంద్రశేఖర్ తెలిపారు. ఆయన బుధవారం గిరింపేటలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నామినేషన్ పర్వం నుంచి పోలింగ్ వరకు కూటమి నాయకులు అక్రమాలు, దాడులకు పాల్పడ్డారని తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బీఫామ్స్ చింపేసి దౌర్జన్యం చేశారని తెలిపారు. చివరకు 9 డివిజన్లలో ఎన్నికలు పెట్టారన్నారు. వాటిలోనైనా న్యాయంగా చేశారా అంటే ఉదయం నుంచి నాయకులు, ఏజెంట్లను పోలీసులు అక్రమంగా నిర్బందించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ అండతో అల్లరిమూకలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారని తెలిపారు. ఇంత జరిగినా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 3 డివిజన్లలో కార్పొరేటర్లగా గెలిచారంటే ప్రజాబలం ఎంత ఉందో తెలుస్తోందన్నారు. గెలిచిన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు.


