సూళ్లూరుపేట : నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మను గెలిపించేందుకు అహర్నిశలు శ్రమించిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. బుధవారం ఈ మేరకు సంజీవయ్యకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొని సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. నాయుడుపేటలో సాధించిన విజయం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని హర్షం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఆగడాలను తిప్పికొట్టి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసినందుకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రాదేశిక ఎన్నికల్లో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. నేతలు, కార్యకర్తలను సమష్టిగా నడిపించిన విధానం బాగా నచ్చిందని, భవిష్యత్‌లో సైతం ఇదే విధానం కొనసాగించాలని కోరారు. పార్టీ కోసం నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేసే శ్రేణులను సిద్ధం చేసుకుంటే విజయాలు అవలీలగా వస్తాయని తెలిపారు. పరిషత్ ఎన్నికల్లో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే మరోసారి అభినందనలు తెలిపారు.


