తిరుపతి అన్నమయ్యసర్కిల్: పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దాడులు, పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, బలవంతంగా బయటకు పంపడం వంటి అంశాలపై తాను చేసిన ఫిర్యాదుకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగాల్సిన సమయంలో పోలింగ్ ఏజెంట్లపై దాడులు జరగడం, పోలింగ్ కేంద్రాల్లోకి వారిని అనుమతించకపోవడం, బలవంతంగా బయటకు పంపడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. పోలింగ్ ఏజెంట్లకు రక్షణ కల్పించాలని, పోలింగ్ కేంద్రాల్లోకి వారి ప్రవేశానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, జరిగిన ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించిన రికార్డులను భద్రపరచి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. తన ఫిర్యాదుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిందన్నారు.


