ప్రజాప్రతినిధి అక్రమార్జనకు బలవుతున్న వాహనదారులు
రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల తీరుపై మండిపడుతున్న స్థానికులు
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రగిరి నియోజకవర్గంలో పచ్చ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచేస్తున్నారు. చంద్రగిరికి చెందిన టీడీపీ నేత, సింగిల్ విండో చైర్మన్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎర్రమట్టిని కొల్లగొడుతూ కోట్లు దండుకుంటున్నాడు. ఆయన ధనదాహానికి వాహనదారులు సైతం బలవుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏ ఒక్కరూ అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నెలకు రూ.కోటికిపైనే అక్రమార్జన
అనుపల్లి – చంద్రగిరి ప్రధాన రహదారిపై నిత్యం గ్రావెల్ లోడుతో వెళ్తున్న టిప్పర్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. నరసింగాపురం సింగిల్ విండో చైర్మన్ రాజులగారి వినోద్, ఎమ్మెల్యే నాని అండతో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దందా సాగిస్తున్నారు. రోజుకు 30కి పైగా టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.3 లక్షలకు పైగా అక్రమంగా తమ జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా సాగుతున్న ఈ దందాతో సింగిల్ విండో చైర్మన్ రూ.6 కోట్లపైగా ప్రకృతి సంపదను కొల్లకొట్టినట్టు సమాచారం. అక్రమంగా సాగిస్తున్న ఈ గ్రావెల్ దందాలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నానికి సైతం వాటా వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది.
ప్రాణాలు తీస్తున్నారు
గ్రావెల్‌ను అక్రమంగా తరలించే క్రమంలో టిప్పర్ డ్రైవర్లు మద్యం మత్తులో, పరిమితికి మించిన (ఓవర్ లోడ్) మట్టితో అతివేగంగా వాహనాలు నడుపుతున్నారు. రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత శుక్రవారం రాత్రి తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగి త్యాగరాజులు తన విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మడంపల్లి సమీపంలో అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొని తీవ్ర గాయాలపాలై చావు నుంచి తృటిలో తప్పించుకున్నారు. అదేరోజు ఓ స్కూటీపై టిప్పర్ దూసుకుపోవడంతో ద్విచక్ర వాహనం ధ్వంసమైన ఘటన మల్లయ్యపల్లి దగ్గర చోటుచేసుకుంది.
అధికారుల మౌనం
యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నా సంబంధిత రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల అధికారులు ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరించడంపై సమీప గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ స్థాయిలో మౌనంగా ఉన్నారంటే అక్రమార్కుల నుంచి భారీగానే ముడుపులు అందుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ దందాల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు.
నా దృష్టికి రాలేదు
అనుపల్లి పంచాయతీలో సత్రంమిట్ట గుట్టలో జరుగుతున్న గ్రావిల్ అక్రమ తరలింపు విషయమై నా దృష్టికి రాలేదు. గ్రామ వీఆర్‌ఓ నా దృష్టికి కూడా చెప్పలేదు. పూర్తి సమాచారం తెలుసుకొని అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.
– మధుసూదన్‌రావు, తహసీల్దార్
కొల్లకొడుతున్న సింగిల్ విండో చైర్మన్


