● రెండున్నరేళ్లుగా పేట్రేగుతున్న దాడులు, దౌర్జన్యాలు ● గత డిప్యుటీ మేయర్ ఎన్నికలో రెచ్చిపోయిన పచ్చరౌడీలు ● పట్టపగలే భూ ఆక్రమణలు, ఇళ్ల కూల్చివేతలు ● బాధితులు మొరపెట్టుకున్నా సీఎం, పవన్, లోకేష్ డోంట్ కేర్ ● భయంతో బిక్కుబిక్కుమంటున్న తిరుపతి వాసులు
సాక్షి టాస్క్‌ఫోర్స్:ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో కూటమి గూండాల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 3న జరిగిన తిరుపతి డిప్యుటీ మేయర్ ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. డిప్యుటీ మేయర్ ని ఎన్నుకునేక్రమంలో భాగంగా.. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, అప్పటి మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు బస్సులో ఎస్వీయూనివర్సిటీకి బయలుదేరారు. రెండు నిముషాల్లో యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారనగా కూటమి గూండా లు రాడ్లు, కర్రలు, రాళ్లతో బస్సును అడ్డుకున్నారు. బస్సు డోర్ లాక్ చేసినా.. బస్సు అద్దాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. నలుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. బస్సులో ఉన్న మహిళా కార్పొరేటర్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. టీడీపీ చేసిన అరాచకాలతో డిప్యుటీ మేయర్ ఉప ఎన్నిక మరుసటి రోజుకు వాయిదాపడింది. మరుసటి రోజు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్ల బంధువులను సైతం కిడ్నాప్ చేశారు. టీడీపీ గూండాల నిర్బంధంలో ఉన్న కార్పొరేటర్లను కొట్టి బెదిరింపులకు దిగారు.
మే 10న ఎర్రమిట్టలో..
తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న ఎర్రమిట్టలో మే 10న టీడీపీ గూండాలు కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకునేందుకు యత్నించారు. అక్కారాంపల్లి సర్వే నం.101/3లోని 1.05 ఎకరాల భూమిలో ఉన్న తులసమ్మ అనే వృద్ధురాలు, మరి కొందరు మహిళలను టీడీపీ గూండాలు లాక్కొచ్చి రోడ్డున పడేశారు. దౌర్జన్యంగా జేసీబీలు దింపి వృద్ధురాలు ఉంటున్న షెడ్డును నిలువునా కూల్చివేశారు. అడ్డొచ్చిన మహిళల పట్ల విచక్షణారహితంగా వ్యవరించిన సంఘటన నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. నగర ప్రజలు ఆ ఘటనను ఇప్పటికీ తలచుకుని ఉలికిపాటుకు గురవుతున్నారు. దీని వెనుక టీడీపీ, జనసేనకు చెందిన ముఖ్యనాయకుల పాత్ర ఉందని వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేసిన విషయం తెలిసింది.
జర్నలిస్టులే లక్ష్యంగా టీడీపీ గూండాల దాడులు
జర్నలిస్టులే లక్ష్యంగా టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రారంభం రోజు తిరుపతి కొర్లగుంటలో టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకుని పత్రాలను చించివేశారు. ఈ ఘటనను కవర్‌చేస్తున్న సాక్షి మీడియా కెమెరామెన్ ముఖేష్‌రాయల్, రిపోర్టర్ మోహన్‌పై దాడులు చేశారు. ముఖేష్ రాయల్‌ని రక్తం వచ్చేలా కొట్టారు. కెమెరా లాగేసుకున్నారు. టీవీ ప్రతినిధి ప్రసాద్ మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. అంతకు ముందు.. ఇదే ఏడాది ఆగస్టు 6న సాక్షి ఫొటో గ్రాఫర్ మోహన్‌కృష్ణపై అక్రమ కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. ప్రస్తుత టీడీపీ తిరుపతి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాసులు నివాసం ముందు బెల్టు మురళి కుటుంబీకులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి ఫొటో గ్రాఫర్, యూటూబ్ రిపోర్టర్ సునీల్‌పై జేబీ అనుచరులు దాడిచేసి తిరిగి బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు.
టీడీపీ మాజీ సర్పంచ్ భూమిని కబ్జాచేసిన టీడీపీ నేత
చంద్రగిరి నియోజకవర్గం రంగంపేట మాజీ సర్పంచ్ గోపాల్‌రెడ్డికి చెందిన 80 సెంట్ల స్థలాన్ని టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ కబ్జాచేశారని మునిరాజమ్మ పలుమార్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తిరుపతి– తిరుచానూరు మార్గం మార్కెట్ యార్డు సమీపంలోని సర్వే నం.252/2లో 80 సెంట్ల భూమి ఉంది. 2017లో రూ.3.5 కోట్లకు కొనుగోలు చేశామని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను బయటపెట్టారు. ఆ భూమిని టీడీపీ ఇన్‌చార్జ్ జేబీ శ్రీనివాసులు కబ్జాచేశారని ఆమె ఆరోపించారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కి ఫిర్యాదు చేసినట్లు కూడా వెల్లడించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. చంపేయమని బెదిరించినట్లు ఆమె తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆమె గోడును ఎవ్వరూ పట్టించుకోలేదు.


