తిరుపతి మంగళం : తిరుపతిలో ఆదివారం జరగనున్న కార్పొషన్ ఎన్నికలను పోలీసులు, ఎన్నికల అధికారులు సజావుగా జరిపిస్తారన్న విశ్వాసంతో ఉన్నామని, రిగ్గింగ్ జరక్కుండా అరికట్టాల్సిన బాధ్యత కలెక్టర్, ఎస్పీపై ఉందని కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల సమయంలో టీడీపీ అరాచకశక్తులు, గూండాలు చేసిన దౌర్జన్యాలు దేశమంతా చూసిందన్నారు. అయితే ఆదివారం జరగనున్న ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ అరాచకశక్తులు పోలింగ్ బూతుల్లోకి దూరి రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నట్లు తెలిసిందన్నారు. అందుకోసం తమిళనాడు నుంచి వేలాది మంది ఎర్రస్మగ్లర్లు, హంతకులు, నేరచరిత్రలు కలిగిన వారిని తిరుపతిలోని లాడ్జీలు, హోంస్టేలలో దింపినట్లు సమాచారం ఉందన్నారు. ఎన్నికల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అందుకు పూర్తి బాధ్యత పోలీసులదేనన్నారు. ఎన్నికల అధికారులు వారి ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌పై ఎన్నికల అధికారి సంతకం ఉండాలని, టీడీపీ గూండాలు ఎన్నికల అధికారుల నుంచి బ్యాలెట్ పేపర్లను లాక్కుని వాళ్లకు అనుకూలంగా ఓట్లు వేసుకుంటే అవి చెల్లవని, వెంటనే ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎవ్వరో బెదిరిస్తే బెదిరిపోయి సంతకాలు పెట్టవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వేళ టీడీపీ చేయనున్న అరాచకాలపై ఇప్పటికే తిరుపతి నగరమంతా చర్చించుకుంటోందన్నారు. దొంగ ఓట్లు, రిగ్గింగ్ జరగకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీలు తగిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారన్న నమ్మకంతో ఉన్నామన్నారు.
స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలి
‘సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మా 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారు. తిరుపతిలో ప్రతి ఓటరు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా కలెక్టర్, ఎస్పీ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి..’ అని భూమన డిమాండ్ చేశారు.
అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయండి
తిరుపతి క్రైం: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 34 వార్డుల పరిధిలోని 163 పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించినట్లు రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించి, భద్రత కల్పించాలని కోరుతూ శనివారం ఏఎస్పీ రవిమనోహరాచారి వినతిపత్రం సమర్పించారు.


