జిల్లా వ్యాప్తంగా 559 పోలింగ్ కేంద్రాలు
ఓటు వేయనున్న 4,47,461 మంది ఓటర్లు
110 అత్యంత సమస్యాత్మక,
172 సమస్యాత్మక, 46 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు
ఉదయం 7 నుంచి
సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్
అల్లర్ల ద్వారా ఓటర్లను భయపెట్టేందుకు ‘పచ్చ’ పన్నాగాలు
నిర్భయంగా ఓటేయమన్న కలెక్టర్
జిల్లా సమాచారం
నగరపాలక సంస్థ డివిజన్లు/వార్డులు పోలింగ్ కేంద్రాలు మొత్తం ఓటర్లు
తిరుపతి 66 304 2,90,492
వెంకటగిరి 36 66 44,140
పుత్తూరు 36 70 40,210
నాయుడుపేట 32 64 37,100
సూళ్లూరుపేట 32 55 18,336
మొత్తం 202 559 4,47,461
జిల్లా వ్యాప్తంగా పుర పోరుకు సర్వం సిద్ధమైంది. తిరుపతి కార్పొరేషన్‌తో సహా నాలుగు మున్సిపాలిటీలలో ఆదివారం ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 559 పోలింగ్ కేంద్రాల పరిధిలో 4,47,461 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలావుండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ‘పచ్చ’పన్నాగానికి అధికార పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎలా తీర్పునిస్తారో ఈ నెల 3వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంది.
సాక్షి, తిరుపతి: పురపోరులో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో ఆదివారం తిరుపతి కార్పొరేషన్ సహా పుత్తూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలలో ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 559 పోలింగ్ కేంద్రాల్లో 110 అత్యంత సమస్యాత్మక, 172 సమస్యాత్మక, 46 సున్నిత పోలింగ్ కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు. వీటిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
అందరి దృష్టి తిరుపతిపైనే
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి తిరుపతి కార్పొరేషన్‌పైనే ఉంది. నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి తిరుపతి కార్పొరేషన్‌లో అధికార పార్టీ దౌర్జన్యాలు, దాడులతో అప్రజాస్వామిక పోకడలు పెచ్చుమీరాయి. ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొ ని నామినేషన్ల గడువు ముగిసిన తరువాత మరోసారి అవకాశం కల్పిస్తే తప్ప వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. మరోవైపు ఇప్పటికే తిరుపతి నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 2 వేల మందికి పైగా రౌడీలు, గంజాయి బ్యాచ్ వచ్చారన్న సమాచారం నేపథ్యంలో పోలింగ్ రోజు ఏం జరుగుతోందో అన్న ఉత్కంఠత అందరిలో నెలకొంది. ఇప్పటికే తమకు పోలింగ్ రోజు రక్షణ కల్పించడంతోపాటు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రాష్ట్రపతి, దేశ ప్రధాని, దేశ, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఈ–మెయిల్ ద్వారా కోరారు. వీటిపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. తిరుపతి కార్పొరేషన్‌లో 66 డివిజన్ల పరిఽధిలో 304 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 2,90,492 మంది ఓటర్లున్నారు. పోలీసుల లెక్క ప్రకారం 25 అత్యంత సమస్యాత్మక, 27 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.
పోలీసులపైనే భారం
ప్రజా బలంతో నెగ్గలేమని గ్రహించిన కూటమి పార్టీలు దౌర్జన్యాలు, దాడులతో గెలవాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే నామినేషన్లు, ప్రచార పర్వంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కీలకమైన పోలింగ్ రోజు అల్లర్లు సృష్టించి ఓటర్లు, ఏజెంట్లను భయాందోళనకు గురిచేసి పోలింగ్ బూత్‌లను తమ చేతుల్లోకి తీసుకోవాలని ‘పచ్చ’ పన్నాగానికి సిద్ధమయ్యారు. నాయుడుపేట మున్సిపాలిటీలో గత రెండు మూడు రోజులుగా పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, బెదిరింపులే దీనికి ప్రధాన సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
తిరుపతి సహా నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్


