శ్రీవారి దర్శనానికి 8 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,010 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు

తిరుపతి క్రైం : ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు, అసత్య సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు హెచ్చరించారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, పుత్తూరు మున్సిపాలిటీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శనివారం తిరుపతి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కిడ్నాప్‌ అంటూ తప్పుడు ప్రచారం..

కేసు నమోదు

తిరుపతి 39వ వార్డులో ఓ వ్యక్తి కిడ్నాప్‌కు గురయ్యాడంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించిన ఘటనపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనందుకుగాను కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. పోలీసుల విచారణలో సదరు వ్యక్తి స్వయంగా ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసుకుని వెళ్లినట్లు, ఆయన క్షేమంగా ఉన్నట్లు తేలిందన్నారు.

పోలీసుల ఐక్యతా ప్రమాణం

తిరుపతి క్రైం : జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమైక్యతా ప్రమాణం నిర్వహించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 151వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు పోలీస్‌ అధికారులు, సిబ్బందితో జాతీయ సమైక్యతా ప్రమాణం చేయించారు. దేశ సమైక్యత కోసం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌ (సాయుధ దళం), ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పింఛన్ల సాకుతో ప్రలోభాలు

రామచంద్రాపురం:అధికార గర్వంతో టీడీపీ నేత లు రెచ్చిపోతున్నారు. గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతున్నారు. శుక్రవారం రామచంద్రపురం మండలం, నెన్నూరు గ్రామంలో పింఛన్ల పంపిణీని తమ స్వార్థ రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చుకున్నారు. కేవలం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మాత్రమే పాల్గొనాల్సి ఉండగా, టీడీపీ నేతలు స్వయంగా బరిలోకి దిగడం కలకలం రేపింది. నడవలూరు గ్రామంలో అధికారులతో కలసి టీడీపీ నేత ప్రభాకర్‌ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అంతటితో ఊరుకోక .. తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. ‘మా పార్టీకి ఓటేస్తేనే పింఛను కొనసాగుతుంది.. లేకపోతే కోత విధిస్తాం’ అంటూ బెదిరింపులకు దిగడంతో లబ్ధిదారులు భయాందోళనకు గురయ్యారు.

చిరుత సంచరిస్తోంది.. జాగ్రత్త

తిరుపతి సిటీ:ఎస్వీయూ క్యాంపస్‌ పరిధిలో చిరు త సంచరిస్తోందని విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పాదాచారులు అప్రమత్తంగా ఉండాలని రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాత్రి 7 నుంచి ఉదయం 6గంటల మధ్య వర్సిటీ విద్యార్థులు, పాదాచారు లు తగిన జాగ్రతలతో మెలగాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement