పోలీసుల తీరుపై విచారణకు ఆదేశించిన ఎస్‌ఈసీ | - | Sakshi
Sakshi News home page

పోలీసుల తీరుపై విచారణకు ఆదేశించిన ఎస్‌ఈసీ

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

● 24 గంటల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశం ● గవర్నర్‌కు చేసిన ఫిర్యాదను అనుసరించి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ ● విచారణ నిష్పక్షపాతంగా జరిపి, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి ● డీఐజీ కోయ ప్రవీణ్‌, అన్నమయ్య, కడప జిల్లాల ఎస్పీలనూ విచారణ పరిధిలోకి తేవాలి ● తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి మంగళం : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింస, నామినేషన్ల అడ్డగింతలు, అభ్యర్థులకు బెదిరింపులు, పోలీసుల పక్షపాత వైఖరిపై తాను చేసిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పందించిందని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. తాను గవర్నర్‌కు సమర్పించిన ఫిర్యాదులను గవర్నర్‌ కార్యాలయం ఎస్‌ఈసీకి పంపగా, పోలీసు అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపి, 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఎస్‌ఈసీ ఆదేశించిందని చెప్పారు. ఈమేరకు అక్టోబర్‌ 29న డీజీపీకి లేఖ పంపిందన్నారు. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, తప్పు చేసినట్లు తేలిన అధికారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పుంగనూరు, పులివెందుల, కమలాపురం, బద్వేల్‌, రాజంపేట, యరగ్రుంట్ల తదితర ప్రాంతాల్లో జరిగిన హింస, నామినేషన్ల అడ్డగింతలు, అభ్యర్థులను బెదిరించడం వంటి ఘటనలను తన ఫిర్యాదులో తెలిపానన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు పోలీసు ఉన్నతాధికారుల రాజకీయ పక్షపాత ధోరణి కారణంగా శాంతిభద్రతల పరిరక్షణలో లోపాలు తలెత్తాయని పేర్కొన్నట్లు వివరించారు. ముఖ్యంగా డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కనుబిల్లి, కడప జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ తీరుపై తాను లేవనెత్తిన అంశాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో పోలీసు అధికారుల బదిలీలకు గతంలో జారీ చేసిన నిబంధనలు, 2019లో ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్‌ నియామకంపై కూడా సమీక్షించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా, అక్టోబర్‌ 15న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో పోలీసు అధికారులు విఫలమయ్యారని కూడా తెలిపానన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరపాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగంపై ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని ఎంపీ మద్దిల గురుమూర్తి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement