తిరుపతి తుడా : తిరుపతి కార్పొరేషన్ మేయర్ ఎన్నిక బీసీల ఆత్మగౌరవానికి పరీక్ష.. వెనుకబడిన వర్గాల ఉనికిని చాటుకునే సమయం.. రౌడీ రాజకీయానికి.. అభివృద్ధికి సమరం.. ప్రధానంగా యాదవుల మనుగడను కాపాడుకునే సమయం.. రెండున్నరేళ్లుగా నగరంలో ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించుకునే తరుణం.. ఇందుకోసం ఆదివారం తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మేయర్ అభ్యర్థి వాసుదేవ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు ఆయన సాక్షితో మాట్లాడారు.
తిరుపతి తొలి మేయర్‌గా వైఎస్సార్‌సీపీ బీసీ మహిళకు అవకాశం ఇచ్చి గెలిపించింది. రెండో పర్యాయం కూడా బీసీలకే అవకాశం కల్పించింది.
బీసీల పార్టీగా చెప్పుకునే చంద్రబాబు తిరుపతిలో ఏనాడూ ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా యాదవ కమ్యూనిటీని మోసం చేస్తూనే వస్తున్నారు.
వెనుకబడిన వర్గాలంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. లేదంటే బీసీల రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. బలిజ వర్గంలోనూ అత్యధికులు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను జగనన్నతోపాటు భూమన కరుణాకరరెడ్డి, అభినయ్‌రెడ్డి తమ కుటుంబీకులుగానే భావిస్తుంటారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతిలో అభివృద్ధి నిలిచిపోయింది.
2014లో తిరుపతిని సింగపూర్‌ని చేస్తానని మాయ మాటలు చెప్పారు.
స్థానిక ఎన్నికల ముందు తిరుపతి అభివృద్ధికి రూ. 3,222 కోట్లు ఖర్చు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.వందల కోట్లతో తిరుపతిని భూమన కుటుంబం అభివృద్ధి చేసింది. నాడు చేపట్టిన అనేక అభివృద్ధి పనులు రెండున్నరేళ్లుగా ఆగిపోయాయి. మేయర్‌గా గెలిపిస్తే 2024 ఏప్రిల్ తర్వాత అభివృద్ధి ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు పడతా. ప్రతి వార్డులోనూ గ్రీవెన్‌న్స్ సెల్ ఏర్పాటు చేస్తా. ప్రతి ఇంటికీ రోజూ మంచి నీటిని సరఫరా అందిస్తా.
తిరుపతికి ఐకానిక్‌గా నిలపాలని తలపెట్టిన సీఓసీ బిల్డింగ్ (కార్పొరేషన్ కార్యాలయ నూతన భవనం) ఏడాదిలో నిర్మించి చూపిస్తా. లేకుంటే నా పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతాను. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 306 కోట్ల వాటా అప్పును చట్ట ప్రకారం తీసుకొచ్చేలా చర్యలు చేపడతా.
మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను తీసుకుంటాను. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో గడిపేలా చర్యలు చేపడతా.
కూటమి నేతల్లా నేను మాటలు చెప్పను. చెప్పింది, చెప్పనిది కూడా చేసి చూపించడం భూమన అభినయ్ నుంచి నేర్చుకున్నా.


