● పత్రికాస్వేచ్ఛను హరించడమే.. ● విష సంస్కృతి సరికాదు ● జర్నలిస్ట్ సంఘాల నేతలు
రాష్ట్రవ్యాప్తంగా మీడియా ప్రతినిధులపై తరచూ దాడులకు తెగబడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం వేకువజామున శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సాక్షి రిపోర్టర్ సుబ్బారెడ్డిపై టీడీపీ గుండాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిని పలువురు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఖండిస్తున్నారు. మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని, పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని మండిపడుతున్నారు. తిరుపతిలో సైతం గడిచిన మూడు నెలల్లో మీడియా ప్రతినిధులపై వరుస దాడులు జరిగాయి. జర్నలిస్టులపై దాడి చేయడం, కెమెరా లాక్కోవడం, మొబైల్ ను ధ్వంసం చేయడం వంటి వాటికి పాల్పడుతున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నామినేషన్ రోజు కొర్లగుంటలో ముగ్గురు సాక్షి ప్రతినిధులపై దాడి చేయగా, రెండవ రోజు కార్పొరేషన్ కార్యాలయం వద్ద మరో పత్రిక విలేఖరితో గొడవపడ్డారు. తిరుపతిలో కొత్త సంస్కృతికి తెరతీయడంపై జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – తిరుపతి తుడా


