తిరుమలలో నీటి నిల్వల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో నీటి నిల్వల పరిశీలన

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

తిరుమల : తిరుమలలో భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలో డ్యామ్‌లు, నీటి నిల్వలను పరిశీలించారు. టీటీడీ చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత నీటి నిల్వలు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ వరకు సరిపోతాయని వెల్లడించారు. ఒకవేళ వర్షాలు కురవని పరిస్థితి ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కల్యాణి డ్యామ్‌ లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. టీటీడీ అదనపు ఈఓ మాట్లాడుతూ తిరుమలలోని డ్యామ్‌లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు రాబోయే 150 రోజులకు సరిపోతాయని వివరించారు. తిరుమలలో రోజువారీ నీటి అవసరం 50 లక్షల గ్యాలన్లు కాగా, ఇందులో 50 శాతం టీటీడీ సొంత డ్యామ్‌ల నుంచి, మిగిలిన 50 శాతం కల్యాణి డ్యామ్‌ నుంచి వినియోగిస్తున్నట్లు తెలిపారు. అన్ని డ్యామ్‌లు నిండితే సుమారు ఏడాదిన్నర పాటు తిరుమలలో నీటి ఎద్దడి ఉండదని వివరించారు. తిరుమలలో నీటి వృథాను అరికట్టి పొదుపుగా వినియోగించేందుకు భక్తులకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు నరేష్‌ కుమార్‌, శాంతారామ్‌, ఎస్‌ఈ వేణు గోపాల్‌, ఈ ఈ సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement