శ్రీకాళహస్తి: సినీనటుడు రామచరణ్ సతీమణి కొణిదెల ఉపాసన బుధవారరం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని సేవించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. ముందుగా ఆమె ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.
టీడీపీలో ‘ఇంటి’ పోరు
– జెడ్పీటీసీ అభ్యర్థులుగా భార్యాభర్తల పోటీ
రామచంద్రాపురం: టీడీపీలో అంతర్గత విబేధాలు ఏకంగా పార్టీ మండల అధ్యక్షుడి ఇంట్లోనే కుంపటి రాజేశాయి. ఈ ‘ఇంటి పోరు’ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. భార్యాభర్తలు జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీకి దిగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
భర్తకు బీఫామ్.. స్వతంత్రంగా భార్య!
టీడీపీ మండల అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి జెడ్పీటీసీ అభ్యర్థిగా అధికారికంగా బీఫామ్ అందుకొని బరిలో నిలిచారు. అయితే ఆయన సతీమణి మేకల మాధవి కూడా అదే స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీ పడుతున్నారు. మండల స్థాయిలో పార్టీని నడిపించాల్సిన వ్యక్తి ఇంట్లోనే ముసలం పుట్టడంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ పోరు చివరకు పార్టీ పరువును వీధికి ఈడ్చిందని స్థానిక నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
హత్యాయత్నం కేసులో
ఒకరికి జైలు
నాయుడుపేట టౌన్ : హత్యాయత్నం కేసులో నిందితుడు అన్నమేడు గ్రామానికి చెందిన అరుచూరు అనిల్‌కు ఏడేళ్లు సాధారణ జైలు శిక్షతో పాటు రూ 3వేలు జరిమాన విధిస్తూ గూడూరు అసిస్టెంట్ సెక్షన్ జడ్జి కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు బుధవారం స్థానిక పోలీసులు తెలిపారు. వివరాలు.. 2018 ఏప్రిల్‌లో అన్నమేడు గ్రామ దేవత నాగర్పమ్మ ఆలయ సమీపంలో పట్టుకోట మురళీ మోహన్ కూర్చుని ఉండగా పాత కక్షలు మనసులో పెట్టుకుని అనిల్ కత్తితో తలపై నరికాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు, నరసింహులుతో పాటు ప్రస్తుత సీఐ వెంకటరమణ, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంజీవయ్యను నాయుడుపేట డీఎస్పీ అభినందించారు.
ముక్కంటి హుండీ లెక్కింపు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలోని హుండీలను బుధవారం కొట్టు మండపంలో లెక్కించారు. ఆలయ ఈఓ బీకే వెంకటేశులు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రధాన హుండీలతోపాటు పరివార దేవతల వద్ద హుండీల ద్వారా మొత్తం రూ.1,23,34,698 వచ్చినట్లు వెల్లడించారు. అలాగే బంగారం 25 గ్రాములు, వెండి 340.690కిలోలు, విదేశీ కరెన్సీ 86 వచ్చినట్లు వివరించారు.
ఎర్ర చందనం పట్టివేత
ఏర్పేడు : మండలంలోని చింతలపాలెం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం బొలేరో వాహనంలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి నుంచి ఏర్పేడు వైపు వెళుతున్న బొలేరోను ఆపి తనిఖీ చేయగా, ఇంటి పాత సామాన్ల కింద 237 కిలోల ఎరచ్రందనం దుంగలు పట్టుబడ్డాయి. వాహనం సీజ్ చేసి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు తమిళనాడు వాసులపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
ఇరువర్గాల ఘర్షణపై ఫిర్యాదు
ఏర్పేడు : మండలంలోని పంగూరు వద్ద నిర్వహిస్తున్న ఓ మద్యం దుకాణం ఎదుట మూడు రోజుల కిందట పంగూరు, రాజులపాళెం గ్రామాలకు చెందిన యువకులు ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో కొందరు గాయపడ్డారు. ఈ క్రమంలో బుధవారం ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.


