రూ.35కోట్ల మురుగు రాజకీయం | - | Sakshi
Sakshi News home page

రూ.35కోట్ల మురుగు రాజకీయం

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

తిరుపతి మంగళం : తిరుపతిలో మురుగు రాజకీయం నడుస్తోందని, రూ.35 కోట్లతో ప్రారంభించాల్సిన కేంద్ర ప్రభుత్వ అమృత్‌ పథకం పనుల్లో విషం చిమ్ముతున్నారని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. బుధవారం తిరుపతి కొర్లగుంటలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్లు పూర్తయి వందరోజులు గడిచినా పర్సెంటేజీలు కుదరక వాటిని తెరవడం లేదని, దాంతో నగర ప్రజలు మురుగు వాసనతో అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. మురుగు ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ కోసం కేంద్ర ప్రభుత్వ రూ.35కోట్ల పనులకు టెండర్లు విడుదల చేసిందన్నారు. అయితే ఈ టెండర్లలో బెంగుళూరుకు చెందిన కేబీఆర్‌ ఇన్‌ఫ్రా కంపెనీ, జిల్లాకు చెందిన జేఎంసీ, గుంటూరుకు చెందిన రఘురామ్‌ హోమ్‌ పైప్స్‌ కంపెనీలు టెండర్లు వేశాయని తెలిపారు. అయితే బెంగుళూరుకు చెందిన కంపెనీకి అన్ని అర్హతులు ఉండడమే కాకుండా టెండర్‌కు అనుగుణంగా తక్కువకు కోట్‌ చేసిందన్నారు. అయితే ఈ పనులు ప్రారంభించడానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రూ.3.5కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. డ్రైనేజీ నీళ్లను శుద్ధి చేసి పరిశ్రమలకు అందించాలనే ఉద్దేశంతో స్థాపించబోయే ప్రాజెక్టును కమీషన్ల కోసం అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. ఈ మురుగు ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ వల్ల తిరుపతిలో చాలా వరకు మురుగు శుభ్రం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. కూటమి దౌర్జన్యం కారణంగా ఇప్పటివరకు టెండర్‌ ఓపెన్‌ కాలేదంటే వారి దాదాగిరి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని విమర్శించారు.

ప్యాకేజీలకే పవన్‌ ప్రాధాన్యత

స్థానిక ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయ లోపంతో కిందస్థాయి శ్రేణుల్లో కుమ్ములాటలు జరుగుతున్నాయని భూమన ఆరోపించారు. జనసేన పార్టీ శ్రేణులకు బీఫామ్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా, టీడీపీ నాయకులు కొట్టి నామినేషన్‌ పత్రాలను చింపేస్తున్నా పవన్‌కల్యాణ్‌ అవేమీ పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా, వారు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నా పట్టించుకోకుండా కేవలం చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలకే పవన్‌కల్యాణ్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. దీంతో అనేక మంది జనసేన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement