తిరుపతి క్రైమ్ : జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం ఈ మేరకు తిరుపతిలోని బైరాగిపట్టెడలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఎంజీఎం స్కూల్ నుంచి ప్రారంభమైన మార్చ్ టీవీఎస్ షోరూమ్, లక్ష్మీపురం సర్కిల్ మీదుగా పోస్టల్ కాలనీ వరకు కొనసాగింది. స్పెషల్ పార్టీ, ఆర్‌మ్డ్‌డ్ రిజర్వ్, స్థానిక పోలీసులు, బ్లాక్ కమాండోలు, ఎస్టీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా, ప్రలోభ పెట్టినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్‌లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. అదనపు ఎస్పీలు శ్రీనివాసులు, రవి మనోహరాచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.


