ఈమె పేరు నన్నం ప్రిస్కిల్లా.. పెళ్లకూరు మండలం నెలబల్లి ఎంపీటీసీ సెగ్మెంట్ ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో నామినేషన్ వేసేందుకు తొలిరోజు నుంచి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ, కూటమి రౌడీమూకలు తొలిరోజు దౌర్జన్యం చేసి నామినేషన్ కేంద్రం లోపలకు పోనీకుండా అడ్డుకున్నారు. రెండో రోజు పోలీసులు బందోబస్తు నడుమ నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్ సమయంలో సాక్షి సంతకాలు చేయడానికి వచ్చిన మహిళలను లోపలికి అనుమతించలేదు. దాంతో సాక్షి సంతకం స్క్రూటినీ రోజు పెట్టుకోవచ్చని రిటర్నింగ్ అధికారి డాక్టర్ ధనుంజయులు సూచించడంతో ఒక్క సంతకం మాత్రమే పెట్టి వచ్చేసింది. తర్వాత సాక్షి సంతకం లేదని నామినేషన్ తొలగించారు. సాయంత్రం వరకు పడిగాపులు కాచినా పట్టించుకోలేదు. ఆర్‌డీఓకి అప్పీలు చేసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.


