ఎన్నికల సమయంలో అలవికాని హామీలు
అధికారంలోకి వచ్చాక అరకొరగా అమలు
నిరుద్యోగ భృతి లేదు..
ఫీజు రీయింబర్స్‌మెంటు రాదు
ఆడబిడ్డ నిధి ఊసే ఎత్తరు.. ఏటా 4 లక్షల ఉద్యోగాల ప్రస్తావనే తీసుకురారు
చంద్రబాబు సర్కార్‌పై మండిపడుతున్న ప్రజలు, విద్యార్థి సంఘాలు
ఎన్నికల సమయంలో బాబుగారి హామీలు రెండున్నరేళ్లలో అమలు చేసినవి
ఏడాదికి 4లక్షల చొప్పున 20లక్షల ఉద్యోగాలు భర్తీ నిల్
ఆడబిడ్డనిధి (నెలకు రూ. 1500) చేతులెత్తేశారు
నిరుద్యోగ భృతి (నెలకు రూ.3వేలు) నామం పెట్టేశారు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విద్యార్థులకు నరకం
ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల తూతూమంత్రమే
ఇంటికో పారిశ్రామిక వేత్తను చేస్తాం మాటలకే పరిమతం
యువతకోసం ప్రత్యేక మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్స్ నిల్
ఇతర రాష్ట్రాలకు వెళ్లుతున్న నిరుద్యోగుల వలసను అరికడతాం ప్రగల్బాలకే పరిమితం
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, ఓబీఎమ్‌ఎమ్‌ఎస్, స్టార్టప్స్ నిల్
సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్స్ అమలు అంతా ఉత్తిదే
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాం ఊసేలేదు
టీటీడీ వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఉద్యోగాల భర్తీ లేదని తేల్చేశారు
యూనివర్సిటీలలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు నిల్
ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత ఉన్న వాటిని ఊడబెరికారు
ప్రతి మండలంలో స్కిల్ డెవలప్‌మెంట్ హబ్స్ మాయమాటలే
ఇంటింటా సర్వేతో యువతను గుర్తించి ఉపాధి కల్పిస్తాం నిల్
నిరుద్యోగ యువత ఉపాధికి షరతులు లేని రుణాలు మాటలకే పరిమితం
ఎమ్‌ఎన్‌సీ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలకు రిజర్వేషన్ల అమలు ఉత్తుత్తి మాటలే
ఎన్నికలు వస్తే చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. అది చేస్తాం.. ఇది ఇచ్చేస్తామంటూ అలవికాని హామీలు గుప్పిస్తారు. అధికారంలోకి వచ్చాక వెంటనే మాట తప్పేస్తారు. నాలుక మడతపెట్టేస్తారు. ఏదీ సక్రమంగా అమలు చేయకుండానే అన్నీ చేసేశామంటూ నాటకాలు మొదలు పెట్టేస్తారు. ఈ క్రమంలో బాబు వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
తిరుపతి సిటీ : హామీలు ఇచ్చి చేతులెత్తేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 2024 సార్వత్రిక ఎన్ని కల సమయంలో యువతను, మహిళలను ఆకట్టుకోవడం కోసం అలివికాని హామీలతో ప్రచారం చేసి ఓట్లు దండుకున్నారు. అధికారం చేపట్టిన వెంటనే తాను ప్రజలకు ఇచ్చిన హామీల ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల సమయంలో మూడు పర్యాయాలు జిల్లాలో పర్యటించిన బాబు అండ్ బ్యాచ్ వాగ్దానాలతో హోరెత్తించారు. ప్రతి కుటుంబంలోని ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఇస్తామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3వేలను ఉద్యోగం వచ్చేవరకు చెల్లిస్తామని నమ్మబలికారు.యువగళం పాదయాత్రలోనూ ప్రస్తుత మంత్రి లోకేష్ యువతకు అండగా ఉంటానని నిరుద్యోగభృతితో పాటు ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో 20లక్షలు ఉద్యోగాలు, ఇంటికో పారిశ్రామికవేత్తను చేస్తామన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం ఊడగొట్టి రోడ్డుపాలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సైతం చేతులెత్తేశారు. దీంతో పేద బిడ్డలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలను ఈ హామీలపై నిలదీస్తున్నారు.


