తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రజలకు మంచి చేసుంటే కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయమెందుకని కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుపతి నగరంలోని 3, 4, 30, 31, 32, 39, 58 వార్డులలో మంగళవారం వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వాసుయాదవ్‌తో పాటు కార్పొరేటర్ అభ్యర్థులు ఉమా అజయ్, కిటు, షాహిన్ షేక్ ఇమ్రాన్, మురళీయాదవ్, కోదండ, సాయికుమారి, పుల్లయ్యతో కలిసి భూమన, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక నగరం ఎంతో ప్రశాంతంగా ఉండేదని, ఒక గూండాకు తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్ పదవితో పాటు మేయర్ అభ్యర్థిగా కూడా చంద్రబాబు, లోకేష్ టికెట్టు ఇవ్వడంతో అరాచకాలు, దాడులతో నగరం దద్దరిల్లుతోందన్నారు. అందులోనూ ఎవ్వరైతే ఎక్కువ రౌడీయిజం, గూండాగిరి చేసుంటారో అలాంటి రౌడీలకు కార్పొరేటర్ అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతిపేదవాడికి సంక్షేమ పథకాలు అందించారని, ఆ నమ్మకమే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


