పెళ్లకూరు: కూటమి అక్రమ కేసుల వల్ల జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి జైలు నుంచే పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసి పోటీలో నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల అనుమతితో మంగళవారం లేఖ విడుదల చేశారు. అందులో ఏముందంటే.. ‘కూటమి రౌడీమూకలు చేస్తున్న దాడులకు భయపడకుండా మండల అభివృద్ధి కోసం, ప్రజల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క ఓటరూ సరైన నిర్ణయం తీసుకోవాలి. కూటమి రౌడీయిజానికి ముగింపు పలకాలి. మండలంలోని ఓటర్లంతా ఓటు వేసే ముందు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మన ప్రాంతానికి కామిరెడ్డి అందించిన సేవలను గుర్తించుకోండి. 1978 నుంచి రాజకీయ అరగ్రేటం చేసి 1987లో సొసైటీ ప్రసిడెంట్‌గా, 2012లో వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్‌గా, 2014, 2019లో మండల పరిషత్ అధ్యక్షుడిగా, 2021లో ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అందరికీ సేవలందించా. వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్‌గా నాయుడుపేటలో రెండు గోదాలు, రెండు ప్లాట్‌ఫాంలు నిర్మించా. నాయుడుపేటలో కమిటీ కార్యాలయం, ఏఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేశా. పెళ్లకూరు ఎంపీపీగా తెలుగుగంగా సబ్ చానల్‌ను అనుసంధానం చేసి 18 గ్రామాలలోని చెరువులన్నింటికీ నీరు సరఫరా చేశా. చిల్లకూరు చెరువు నుంచి శిరసనంబేడు చెరువుకు 2వేల ఎకరాల ఆయకట్టుకు రూ.42 లక్షలతో గంగనీటిని అందించా. మొత్తం 24 పంచాయతీలలో సీసీ రోడ్లు, మురుగు కాలువల అభివృద్ధికి కృషి చేశా. డీసీసీబీ చైర్మన్‌గా నాబార్డు నిధులతో ప్రతి మండలానికీ మూడు చొప్పున ఒక్కొక్కటీ రూ.40 లక్షల వ్యయంతో 140 గోదాములు నిర్మించా. బ్యాంక్ పరిధిలో 180 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించా. పార్టీ అధినేత వైఎస జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహకారంతో రూ.2,500 కోట్ల బ్యాంక్ టర్నోవర్ సాధించా..’నని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను వెన్నుపోటు పార్టీ కూటమి రౌడీమూకలతో అరాచకాలు సృష్టిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మాట తప్పని, మడం తిప్పని జగనన్న నాయకత్వంలో మండల ప్రజలందరి తరపున జెడ్పీటీసీ బరిలో జైలు నుంచే పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి అన్యాయానికి జగనన్న న్యాయానికి మధ్య జరుగుతున్న పోరులో ధర్మం వైపు నిలబడి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని లేఖ ద్వారా మండల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


