తిరుపతి అన్నమయ్యసర్కిల్: కేంద్రంలోని మోడీ పాలనలో ఉపాధి అవకాశాలు విధ్వంసమయ్యాయని ప్రగతిశీ ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. రాష్‌ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కూటమి ప్రభుత్వం అరకొరగా భర్తీ చేస్తోందని విమర్శించారు. అందుకే శాశ్వతమైన, గౌరవప్రదమైన ఉపాధి ప్రతి విద్యార్థి హక్కు నినాదంతో డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో 24వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మేధావులు, పీడీఎస్‌యూ ప్రతినిధులు మహాసభలకు హాజరు కానున్నట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. అలాగే పెండింగ్‌లోని రూ.64 వేల కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క యూనివర్సిటీకి రూ. 200 కోట్లు నిధులు కేటాయించాలని కోరారు.


