నైలెట్ శాశ్వత క్యాంపస్ తరలింపుపై గళమెత్తిన విద్యార్థి లోకం భూమన అభినయ్ ఆధ్వర్యంలో ఎస్వీయూ వద్ద భారీ ర్యాలీ పార్టీలకతీతంగా హాజరైన విద్యార్థి సంఘాలు, నేతలు కాక్రొచ్ ప్లకార్డులతో కదంతొక్కిన యువత నైలెట్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక హాజరైన ప్రజాప్రతినిధులు
జిల్లా కేంద్రం తిరుపతిలో విద్యార్థిలోకం
భగ్గుమంది. రాయలసీమ యువతకు ఉపాధి
అవకాశాల కోసం శిక్షణనిచ్చే నైలెట్ శాశ్వత
క్యాంపస్ తరలింపుపై గర్జించింది. సీఎం
చంద్రబాబు, మంత్రి లోకేష్ కుట్రలపై గళమెత్తింది. సీఎం సొంత జిల్లాకు ద్రోహం చేస్తారా..? అంటూ మండింది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన కాక్రొచ్ జెన్‌జెడ్ పోరును తలపించేలా కాక్రొచ్ ప్లకార్డులు చేతబూని ప్రభుత్వ వైఖరి ఖండించింది. నైలెట్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది.
తిరుపతి సిటీ: నైలెట్ శాశ్వత క్యాంపస్‌ను తిరుపతి నుంచి అమరావతికి తరలింపునకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీల కతీతంగా జరిగిన జెన్‌జెడ్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. శుక్రవారం ఎస్వీయూ రెండవ గేటు నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వరకు జరిగిన భారీ ర్యాలీకి తిరుపతి స్థానికులతో పాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందం తరలివచ్చి మద్దత్తు పలికారు. సుమారు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ ర్యాలీకి తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, సుమారు 16 విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.
జన్మనిచ్చిన జిల్లాకే ద్రోహం చేస్తారా?
సీఎం చంద్రబాబుకు జన్మనిచ్చిన సొంత జిల్లా తిరుపతికి ద్రోహం చేయడంపై విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హాయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఎంపీ గురుమూర్తి పోరాటంతో కేంద్రమంత్రులను ఒప్పించి తిరుపతికి ప్రతిష్టాత్మక నైలెట్‌ను తీసుకొస్తే సహించని కూటమి సర్కార్ పగపట్టి తరలించుకుపోవడం దారుణమని మండిపడ్డారు. జిల్లాలో ఏర్పేడు వద్ద రూ.100 కోట్లతో స్థాపించిన స్కిల్ డెవలెప్‌మెంట్ యూనివర్సిటీని సైతం అమరావతి తరలించారని మండిపడ్డారు. అలాగే నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీని సైతం తీసుకెళ్లారని ఆరోపించారు. ప్రస్తుతం వర్సిటీలో ఏర్పాటు చేసిన నైలెట్ సంస్థపై కన్నుపడిందని, దానిని సైతం అమరావతికి తరలించేస్తున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక ఆకర్షణగా కాక్రొచ్ ప్లకార్డులు
జెన్‌జెడ్ ర్యాలీలో కాక్రొచ్ ప్లకార్డులు హల్‌చల్ చేశాయి. పార్టీలకతీతంగా పాల్గొన్న యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు ర్యాలీలో బాబు సర్కార్‌ను విమర్శిస్తూ కాక్రొచ్ చిత్రపటాలతో హెచ్చరించారు. తిరుపతి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తే కాక్రొచ్‌లు పుట్టుకొచ్చి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.


