తిరుపతి మేయర్ పీఠం కోసం పట్టు టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు డివిజన్ల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పోటాపోటీ మేయర్ అభ్యర్థి విషయంపై మూడు పార్టీల్లో అంతర్గత కలహాలు గ్రేటర్ తిరుపతి తీర్మానంపై నీళ్లు చల్లి.. మేయర్ కుర్చీ కోసం పాకులాట 66 డివిజన్లతో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల వైపు అడుగులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిముఖ్యమైన తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల వేడి రాజుకుంది. గత పాలక వర్గం చేసిన గ్రేటర్ తిరుపతి తీర్మానంపై టీడీపీ, జనసేన నేతలు పథకం ప్రకారం నీళ్లు చల్లి మహానగరం విస్తరణకు మోకాలొడ్డారు, గ్రేటర్ చేసే ప్రక్రియలో భాగంగా చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం, రేణిగుంట మండలాల్లోని 160కి పైగా పంచాయతీలను తిరుపతి కార్పొషన్‌లో విలేనం చేసే ప్రక్రియ జరిగింది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు అభ్యంతరాలు తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. దీంతో గ్రేటర్ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. 50 డివిజన్ల నుంచి 66 డివిజన్లతో కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అందుకు సంబంధించి ఓటర్ల విభజన జరిగిపోయింది. అయితే డివిజన్ల పునర్విభజన సరిగా జరగలేదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేయడంతో కార్పొరేషన్ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఆశావహులు
అధికం
తిరుపతి మేయర్ కుర్చీ కోసం కూటమిలోని మూడు పార్టీల నేతలు కుస్తీపడుతున్నారు.
రిజర్వేషన్ల విషయం కొలిక్కిరాకముందే నువ్వా.. నేనా అంటూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. గ్రేటర్ తిరుపతి విషయాన్ని పక్కనబెట్టి మేయర్ కుర్చీ కోసం పాకులాడుతున్నారు.
స్థానికంగా జనసేన ఎమ్మెల్యే ఉండడంతో మేయర్ పీఠం కూడా జనసేనకే కేటాయించాలని పట్టుబడుతుండగా.. ఎమ్మెల్యే జనసేనకు కేటాయించారు కాబట్టి ఈ సారి మేయర్ పీఠం తమకే ఇవ్వాలని టీడీపీ నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. బీజేసీ నేతలు కూడా తమ పలుకుబడిని ఉపయోగించి మేయర్ పీఠాన్ని అధిరోహించేందుకు గట్టిగానే కృషి
చేస్తున్నట్టు సమాచారం.
మూడు పార్టీల నుంచి పోటీ
కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారాలన్నీ ఉపయోగించి మేయర్ పీఠం దక్కించుకోవాలని కూటమిలోని మూడు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. మేయర్ పీఠం తమకే కావాలని జనసేన నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి ఉన్న సమయంలో మేయర్ కూడా అదే పార్టీకి చెందిన వారు ఉంటే బాగుంటుందని, అభివృద్ధి విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటామని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జనసేనకు ఎమ్మెల్యే ఇచ్చామని, మేయర్ టీడీపీకి ఇవ్వాలంటే కుదరదని పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు బీజేపీ కూడా మేయర్ పీఠాని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మేయర్ పీఠం కోసం కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు. అందు కోసం రిజర్వేషన్ల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రిజర్వు (జనరల్) అయితే.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు కీర్తి ముందు వరుసలో ఉన్నారు. జనసేన వైపు నుంచి అన్నా అనిత మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇంకా టీడీపీ మహిళా జిల్లా మాజీ అధ్యక్షురాలు పుష్పావతి పేర్ల ప్రచారంలో ఉంది. లేదా జనరల్‌కు కేటాయిస్తే.. మబ్బు దేవనారాయణరెడ్డి కుటుంబం నుంచి, జేబీ శ్రీనివాసులు, కోడూరు బాలసుబ్రమణ్యం, నరసింహయాదవ్ కుటుంబం నుంచి ఒకరు పోటీలో ఉండే అవకాశం ఉంది. ఇంకా దంపూరి భాస్కర్ యాదవ్, కృష్ణయాదవ్, ఆర్సీ మునికృష్ణ తదితరులు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. అనూహ్యంగా ఈ సారి బీజేపీ నుంచి కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి పదవీ కాలం ముగియనుండడంతో ఈ సారి మేయర్ పీఠంపై కూర్చోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా సామంచి శ్రీనివాసులు కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది. భాను మాత్రం.. తన పలుకుబడిని ఉపయోగించి.. కేంద్రం నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే.. డివిజన్ల కేటాయింపులోనూ మూడు పార్టీల దారులు ఒక్కో రకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ అడిగేవే జనసేన కూడా అడుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లు అడుగుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మొత్తానికి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు.. కూటమికి చిక్కులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.


